వామనావతారం: శ్రీ మహావిష్ణువు యొక్క ఐదవ అవతారం

గత కథలో మనం శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని సంహరించి, ధర్మాన్ని నిలబెట్టిన విషయం గురించి తెలుసుకున్నాం కదా! అలానే ఆ శ్రీ మహావిష్ణువు మరలా ఇంకొక అవతారమైన వామనావతారం  గాధను ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు ఈ వామనావతారమేమిటి? శ్రీహరి ఒక చిన్న బాలుని రూపం ఎందుకు దరించవలసి వచ్చింది? బలిచక్రవర్తి ఎవరు? బలిచక్రవర్తిని వామనుడు పాతాళానికి ఎలా తొక్కడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలీ అనుకుంటున్నారా? అయితే ఈ వామనావతార గాధను చదివి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.

బలి చక్రవర్తి-అశురాధిపతి

నారసింహావతారంలో చెప్పబడిన ప్రహ్లాదుని కుమారుడు వీరోచనుడు. వీరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. ప్రహ్లాదుని మనుమడైన రాక్షసరాజు బలిచక్రవర్తిని పాతాళానికి అణగద్రొక్కుటకు శ్రీ మహావిష్ణువు వామనావతారము ధరించాడు.

రాక్షస గురువైన శుక్రాచార్యుని సహాయముతో బలిచక్రవర్తి అనేక యజ్ఞములు చేసి, గొప్ప ఆయుధాలు సంపాదించి స్వర్గలోకముపై దండెత్తి ఇంద్రుని ఓడించి, ఇంద్ర పదవితో పాటు సర్వాన్ని వశపరుచుకున్నాడు.

బలిచక్రవర్తి యజ్ఞం చేయుట

వామనావతారంలో వచ్చిన శ్రీహరి

ఒకనాడు బలిచక్రవర్తి శుక్రాచార్యుని ఆధ్వర్యములో గొప్ప యజ్ఞము చేయసాగాడు. ఆ సమయంలో వామనుడు బాల వటువుగా యజ్ఞశాలయందు ప్రవేశించాడు తేజోవంతుడైన ఆ బాల బ్రాహ్మణుని చూచి బలిచక్రవర్తి సాదరముగా ఆహ్వానించి పీఠముపై కూర్చుండపెట్టి, అతిథి సత్కారములు చేసి బలిచక్రవర్తి వామనుని “ఓ బ్రాహ్మణోత్తమా! నీ రాకవలన యజ్ఞ వాటిక పవిత్రమైనది.

బలిచక్రవర్తి వామనుని కోరుకోమనుట

నీకు దానమిచ్చిన నా జన్మము ధన్యమగును. నీవు ఏమి కావాలో కోరుకో. ఏమి కోరినను ఇచ్చెదను. నీకు బంగారము కావలెనా, మణి మాణిక్యములు కావలెనా? భవనములు కావలెనా? అడుగుము. నువ్వు ఏది కోరితే అది నీదగును” అన్నాడు బలిచక్రవర్తి.

వామనుడి కోరిక

అందుకు వామనుడు “ఓ రాజా! నీ దాన గుణమునకు ఎంతో మెచ్చితిని. నాకేమి పెద్ద కోరికలు లేవు. నాకు ఎలాంటి బంధువర్గం లేదు. నేను ఒంటరివాడను. నువ్వు అడగమన్నావు కాబట్టి ఒక చిన్న కోరిక కోరుతున్నాను. నాకు మూడు అడుగుల స్థలము చాలు అది ఇమ్ము” అనెను.

వచ్చినవాడు వామనుని రూపములో ఉన్న మహావిష్ణువు అని తెలియక వామనుడు అన్నమాటలకు బలిచక్రవర్తి నవ్వి “ఓ బ్రాహ్మణోత్తమా! నువ్వు పెద్ద పెద్ద కోరికలు కోరుతావు అనుకొన్నాను. అయినా మించి పోయింది ఏమీ లేదు. నీకు సర్వ సంపదలూ, రాజ్యము కోరుకో ఇచ్చివేస్తాను” అని అన్నాడు.

బలిచక్రవర్తి వాగ్దానం

అందుకు వామనుడు “అవేమీ నాకు వద్దు రాజా! నాకు మూడు అడుగుల నేల ఇస్తే చాలు మిక్కిలి సంతోషముతో వెళ్ళెదను” అన్నాడు. అందుకు బలిచక్రవర్తి నవ్వుతూ కమండలములోని నీరు తీసుకొని భూమిమీద జల్లుతూ “నీవు కోరినట్లే పాదముతో కొలిచిన మూడు అడుగుల నేలను ఇప్పుడే ఈ క్షణముననే నీకు ఇస్తున్నాను” అని వాగ్దానం చేశాడు.

శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని హెచ్చరించుట

అంతలో రాక్షస గురువైన శుక్రాచార్యుడు అడ్డు తగిలి, ఆ వచ్చినవాడు మారు రూపములో ఉన్న మహావిష్ణువనీ, అతను కోరినది మోసపూరితమైన కోరిక అనీ, ఆ కోరిక తీర్చవద్దని బలిచక్రవర్తిని వారించాడు. అందుకు బలిచక్రవర్తి “నేను ఆడిన మాట తప్పను. ఏది ఏమైనా సరే ఆ కోరిక నెరవేరుస్తాను” అన్నాడు.

వామనుడి విశ్వరూపం

అంతట వామనుడు చూస్తుండగానే తన రూపాన్ని పెద్దగా మార్చి విశ్వరూపుడుగా మారి త్రివిక్రముడయ్యాడు. ఒక పాదముతో ఆకాశమును, మరొక పాదముతో భూమిని కప్పి వేసాడు. అప్పుడు త్రివిక్రముడు బలితో “రాజా! నీవు నాకు మూడు అడుగులు దానమిచ్చావు. నేను రెండు అడుగులతో భూమి, ఆకాశములను కప్పితిని. నా మూడవ పాదము పెట్టుటకు చోటు చూపించమని బలిని అడిగాడు.

అందుకు బలి చక్రవర్తి “జగన్నాథా! ప్రాణాలు పోయినా ఆడినమాట తప్పడు ఈ బలిచక్రవర్తి. మీ మూడవ పాదం నా తలమీద మోపి, ఆ మూడవ అడుగును స్వీకరించండి దేవా!” అని చేతులు జోడించాడు.

వామనుడి ఆశీర్వాదం

ఆ మాటలకు శ్రీమహావిష్ణువు కూడా సంతసించి చిరు మందహాసంతో “దానవరాజా! నీ సత్యవ్రతం ముల్లోకాలనూ ఆశ్చర్యంతో ముంచి వేసింది. నీవు నీ సంతతి నా భక్తికోటిలో ఒకరుగా వెలుగొందుదువు గాక! ఈనాటి నుండి నీవు కొంతకాలం పాతాళంలో ఉండి తరువాత సావర్ణి మన్వం తరంలో ఇంద్రుడవై త్రిలోకాధిపత్యం వహించి తరించెదవు గాక!” అని దీవించాడు.

ఆ విధంగా శ్రీమన్నారాయణనుడు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి దర్పమణచి అతనిని పాతాళానికి పంపి, మరల దేవతలకు తిరిగి త్రిలోకాధిపత్యం కట్ట పెట్టాడు.

Leave a Comment