పండుగ: అవగాహన – దృష్టికోణం
నేటి సమాజపు తీరు
సనాతన ధర్మాన్ని పాటించే హిందువులు అయిన మనం ప్రతి ఏడాది ఏదో ఒక పండుగ జరుపుకుంటూనే ఉంటాము. ఒక్కో పండుగకు ఒక్కో దేవుడిని పూజిస్తూ, కొత్త బట్టలు వేసుకుని, పిండి వంటలు చేసుకుని, విలాసాలు చేస్తూ సాయంత్రం అలా షికార్లు చేయడం ఈ తరం సమాజంలో నడుస్తుంది.
అర్థం కోల్పోయిన మన ఆచార సాంప్రదాయాలు
పండుగ అంటే మన సరదాల కోసమే ఆ నాటి పెద్దలు ఉంచారా ? లేదా మనకి ఎదైనా సందేశం ఇవ్వడానికే ఈ పండుగ మన వద్దకు తెచ్చారా ? సాధారణంగా ఈ ప్రశ్నలు మనకు ఎప్పుడు రావు. వాస్తవంగా మనం ఆచరించే ప్రతి సంప్రదాయం వెనుక ఎంతో ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ అర్ధాలు దాగి ఉంటాయి.
మానవాళి మనుగడకు ఉపయోగపడే ఎన్నో సందేశాత్మక విషయాలు కూడా మన ఆచార సాంప్రదాయలలో భాగంగా ఉన్నాయి. అది మనం ఇప్పటికీ తెలుసుకోకుండా కొత్త పోకడలతో వృధాగా వాటిని ఆచారిస్తున్నాం. పూర్వం పెద్దలు పండుగను ఎంతో గొప్ప ఉద్ధేశ్యంతో ఉంచి వెళితే, నేడు మనం దాని అర్ధం తెలీకుండానే పండుగలను జరుపుకుంటున్నాము. కావున పండుగ యొక్క పూర్తి ఆధ్యాత్మిక అర్ధాన్ని మరియు వాటి వెనుక దాగి ఉన్న రహస్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పండుగ: ప్రక్రియ – అంతరార్థం
మానవ చైతన్యం కొరకు మన పూర్వీకులు ప్రవేశపెట్టిన ప్రక్రియ
మన పూర్వ కాలమున అనగా కృతయుగములో మనుషుల సంఖ్య తక్కువగా ఉండే రోజుల్లో, మానవులలో జ్ఞానం తగ్గిపోయి అజ్ఞానం పెరిగిపోయింది. మానవుడు అంతర్ముఖ ధ్యాసను వదిలి బాహ్య ధ్యాసలో పడిపోయాడు. తన సంపాదన మీద మాత్రమే దృష్టి సారించి తన కంటికి కనిపించే ఫలితం మీద ధ్యాస పెట్టాడు తప్ప, కనిపించని ఫలితం అయిన పాప పుణ్యముల మీద మాత్రం ధ్యాస పెట్టలేకపోయాడు.
దాని కోసమే మనుషులలో ఆధ్యాత్మిక దృష్టిని మరియు పాప భీతిని పెంచడం కోసం, అలాగే కాలం యొక్క ప్రాముఖ్యతను జనులకు అర్ధం అయ్యేలా చెప్పడం కోసం ఆనాటి జ్ఞానులు ఎన్నో రకాలుగా మనుషులలో చైతన్యం కలిగించేందుకు పూనుకున్నారు.
అందులో భాగంగా ప్రతి మనిషి తన జీవితం లో వెనక్కి తిరిగి చూసుకునే విధంగా, తాను గడిచిన జీవితంలో ఏమి చేశాను ఏమి సాధించాను అని విశ్లేషించుకునే విధంగా చేయాలి అనుకున్నారు.
ఆ ప్రక్రియకు పండుగ అనే పేరు పెట్టుట
ఏ విషయం అయినా మనిషికి బాగా అర్ధం కావాలి అంటే దాన్ని ఇంకొక దానితో పోల్చి చెప్తే స్పష్టంగా అర్ధం చేసుకుంటారు అని తెలుసుకున్న పెద్దలు, ప్రకృతిలో గల చెట్టు యొక్క ఫలము అయిన పండుని ఉదాహరణగా చూపుతూ ఒక ప్రక్రియను మనుషుల మధ్య ప్రవేశ పెట్టారు.
ప్రతి సంవత్సరం చెట్టుకి కాయలు కాయడం పండు(Ripened Fruit) గా మారడం అనే ఈ ప్రక్రియలో పండుగ అనే పేరును తీసుకుని ఆ పేరుతోనే ఆచరించేలా చేశారు, ఈ విధంగా పండుగ అనే పేరు వచ్చింది.
పండుగ అనే ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్ధేశం
ఒకప్పుడు ఒకే హిందూ మతంగా ఉన్న మానవ జాతి మొత్తం నేడు అనేక మతాలుగా చీలిపోయి ఉన్నప్పటికీ పూర్వం కృతయుగంలో మన పెద్దలు పెట్టిన ఆచారం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. నేటికీ మనుషుల మధ్యలో పండుగ ఆచరణ ఉన్నప్పటికీ ముఖ్యమైన అర్ధం లేకుండా, అర్ధం లేని ఆచరణ వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.
నేడు మనుషుల మధ్య పండుగలు మిగిలిపోయినా, అప్పటి అర్ధం మారిపోయింది. ఆనాటి పెద్దలు ఉంచిన ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్ధేశం ఏమిటి అంటే, కాలం చాలా విలువైనది మరియు గడిచిన కాలం తిరిగి తీసుకురాలేనిది. సృష్టిలోని ప్రతీ జీవరాశి కాలమును అనుభవిస్తుంది.
ప్రతీ జీవరాశి మంచి, చెడు పనులతో కాలమును వినియోగించుకుంటుంది. జరిగే కాలంలో మంచి పని జరిగినా, చెడ్డ పని జరిగినా అది చేసే జీవరాశికే ఆ పనిలోని ఫలితము అనుభవము వస్తుంది తప్ప కాలానికి మంచి-చెడులతో ఎటువంటి సంబంధం ఉండదు. అంధువలన కాలం ధైవ స్వరూపం అయినది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాలం ఒక జాతికి లేదా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా యావత్తు జగమునకు వినియోగింపబడుతుంది. కాలం అందరికి ఒక్కటే, ఒక జీవుడికి తన జన్మతో ప్రారంభం అయిన కాలం మరణంతో అంతం అవుతుంది.
జన్మకు మరణానికి మధ్య ఉన్న కాలమే జీవితము లేదా ఒక జీవిత కాలము అంటున్నాము. జీవిత కాలంలో మంచిగా కొందరు, చెడ్డగా కొందరు తమ జీవితాన్ని సాగిస్తున్నారు. అనంతమైన ఈ కాలంలో ఎవరు ఎలా గడిపినా చివరికి కాలగర్భంలో కలిసిపోవలసిందే.
ఇప్పటి మానవుడు అసలు ఈ కాలం అంటే ఏమిటి అని ఆలోచించకుండా వృధాగా కాలం గడిపేస్తూ, పుట్టుకకి కారణం తెలియక జీవిస్తున్నాడు. ప్రతి క్షణం మన శరీరం మార్పు చెందుతూ బాల్యం నుండి వృద్ధాప్యానికి చేరుకుంటూ మృత్యువుకు దగ్గర అవుతుంది.
జరగబోయే కాలంలో ప్రతి ఒక్కరూ ఎదో ఒక రోజు మృత్యువును చేరవలసిందే అయిననూ, దాన్ని దృష్టిలో పెట్టుకుని మరణం దగ్గర అవుతుంది అని ఎవరూ తలవడం లేదు. మనం తలచినా తలవకపోయినా కాలం ఆగేది కాదు, మృత్యువు రాక మానదు.
మానవుని దృష్టిలో విలువ లేని కాలానికి విలువ కల్పించాలని, జరిగిన కాలము తిరిగి రాదని అర్ధం అయ్యేలా చేయాలని, మానవ జీవిత కాలము కొద్ది పాటిదే అని తెలిసి ఆ కొద్దిపాటి కాలం కూడా ఖర్చు అయిపోతుందని దాని గురించి ఆలోచించాలని, అలాగే జరిగిన జీవితంలో మనము ఏం సాధించాము అని యోచించేలా అసలు కాలం అంటే ఏమిటో కనువిప్పు కలిగించాలని పూర్వం జ్ఞానం ఉన్న పెద్దలు మనుషుల చేత ఆచరించేలా చేసిన ప్రక్రియనే పండుగ అంటున్నాము.
పండుగ: ఉదాహరణ – వివరణ
చమత్కారపు ఉదాహరణ వెనుక దాగి ఉన్న అమూల్యమైన అర్ధం
ముందుగా చెప్పుకున్న విధంగా కాయ పండుగా మారే ప్రక్రియ ద్వారా పండుగ అనే పదము వచ్చినది అనే ఉదాహరణ హాస్యాస్పదముగా అనిపించినా దానిలో చాలా అర్ధం దాగి ఉంది.
సాధారణంగా ప్రకృతి సిద్ధంగా ప్రతి చెట్టు సంవత్సరానికి ఒకసారి పుష్పించి కాయలు కాయడం సహజం. చెట్టు నుండి కాయ కాచి పండుగా మారే వ్యవధి ఒక సంవత్సర కాలము పడుతుంది. కాబట్టి చెట్టును ఉదాహరణగా తీసుకున్నారు. అలాగే మానవుడి జీవితంలో గడిచిన సంవత్సర కాలమును పండుగ అని పేరు పెట్టారు. అదే విధంగా చెట్టుకి ఉన్న కాయ పక్వానికి వచ్చిన కాలమును మానవ జీవితంలో పక్వ దినము అనేవారు, ఇప్పుడు పక్వ దినము అనే మాటను పర్వదినము అంటున్నాము.
ఈ విషయం వివరంగా గ్రహిస్తే చెట్టు సంవత్సర కాలానికి తన సారమైన ఒక పండును ఇచ్చి పరులకు ఉపయోగపడుతుంది. అలాగే మానవుడు ఇతరులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు అని గుర్తు వచ్చేటట్లు, సంవత్సర కాలములో తాను సాధించిన ఫలితం ఏమిటి, నేను పుట్టి ఏమి సాధించాను అని ఆలోచించే విధంగా మరియు తన జీవితంలో కొంత కాలం గడిచిపోయినది అని గుర్తుకు వచ్చే విధంగా ఒక దినమును పండుగ అనే పేరుతో పెద్దలు ఉంచారు.
మన పెద్దలు చెప్పిన ఉదాహరణ యొక్క భావము
పూర్వం పెద్దలు పండుగ రోజున తమ జీవితంలో ఒక సంవత్సరం గడిచిపోయినది అని, మరొక కొత్త సంవత్సరం జరగబోతుంది కాబట్టి, జరిగిన ముందు సంవత్సరంలో మంచిగా ప్రవర్తించానా లేక చెడుగా ప్రవర్తించానా అని లెక్కలు వేసుకుని, నేనేమి జ్ఞానము పొందాను, దైవ మార్గంలో నేనేమి సాధించానని వెనుతిరిగి చూసుకునేవాళ్ళు.
తిండి మరియు బట్ట కోసం చింత లేకుండా సమకూర్చుకుని పండుగ రోజు మాత్రము నిత్య జీవనంలో మునిగిపోకుండా వేరే పనులు అన్నీ వదిలి విశ్రాంతి తీసుకుని జరిగిపోయిన కాలము గురించి ఆలోచించడం ఆనాటి కర్తవ్యంగా మారింది. తమ జీవిత కాలము గురించి యోచించేది కాబట్టి జ్ఞాన సంబంధం అయిన దినముగా పండుగను ప్రజలు భావించేవాళ్లు.
నా జీవితం ఇంత కాలం ఈ విధంగా గడిచిపోయినది, జరగబోవు పండుగ కాలం వరకు దైవ సంబంధం అయిన జ్ఞాన జీవితాన్ని గడపాలని కోరుతూ దేవుడి మందిరాలలోనో, తమ ఇంటిలోనో దేవుడి ఆరాధనలు జరిపేవాళ్ళు. నీ జీవితం కొంత కాయ నుండి పండుగా మారిపోయినది అని, కాబట్టి ఎప్పుడు రాలిపోతుందో చెప్పలేమని యోచించుటకు గుర్తింపుగా పెద్దలు ఆనాడు పండుగను ఉంచారు.
మన దేహమును కాయము అని కూడా అందురు. ఒక కాయ పరిపక్వత చెంది పండుగా మారినట్లు మానవుడు కూడా కాలం విలువ తెలుసుకుని నిత్యం ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ, ఇతరులకు సహాయపడుతూ, దైవాన్ని స్మరించుకుంటూ మన శరీరం కూడా పరిపక్వత చెంది జీవుడు మోక్షం పొందాలి అని చెప్పడమే దీని భావము.
పండుగ: ఆచారణ – విశిష్టత
ఖగోళ, పురాణ మరియు ప్రాకృతిక మార్పుల సమ్మేళనమే మనం జరుపుకునే పండుగల నేపధ్యం
మన హిందువులు జరుపుకునే పండుగలకు మొదలు ఉగాది అనగా మనకు నూతన సంవత్సరం ఆరంభం, అలాగే ప్రకృతిలో మార్పులు జరిగి చెట్లు చిగురించే కాలము అయిన వసంత ఋతువు కూడా ప్రారంభం. ఇలా కాలంలో కానీ, ఋతువులలో కానీ వచ్చే ప్రాకృతిక మార్పులను, ఖగోళ విశేషాలను, గ్రహాల గతులను, ముఖ్యమైన మన పురాణ సంఘటనలను, మన దేవతల యొక్క జన్మము మరియు జీవిత గాధలను ఉద్దేశించి మనము పండుగలు జరుపుకుంటూ ఉన్నాము.
జీవిత పాఠాలు, మానవ సంబంధాలు, ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ విశిష్టతలు తెలిపే మన పండుగలు
ఇలా ప్రకృతితో అనుసంధానం అయ్యేలాగా మరియు మన దేవతల యొక్క జీవిత గాధల నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకునే విధంగా మన పండుగలు ఉన్నాయి. ఈ పండుగ రోజులలో మనం గుడికి వెళ్ళి పూజలు చేయడం లేదా ఇంటిలోనే పండుగ విశిష్టత తెలిపే పూజా వ్రత కథలు చదువుతూ దేవతారాధన జరపడం, పిండి వంటలు చేసుకుని నైవేద్యంగా సమర్పించడం, పురాణ పఠనం చేయడం, కుటుంబ సభ్యులతో కలిసి విందు ఆరగించి చక్కగా సమయం గడపడము చేస్తూంటాము.
ఇంకా బందువులను, ఇరుగు పొరుగు వాళ్ళని ఇంటికి ఆహ్వానించడం, వాళ్ళతో కలిసి పండుగ జరుపుకోవడం చేస్తూ ఉంటాము, దీని వలన మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. మన పండుగలు ప్రతి ఒక దానికి అర్థవంతమైన కారణములు, సాంప్రదాయ మరియు శాస్త్రీయ విశిష్టతలు ఉన్నవి. మనం పాటించే ఆచార వ్యవహారాలలో ఎంతో విజ్ఞానం దాగి ఉంది.
పండుగ: మన తరం – మన బాధ్యత
ఇప్పటి తరం పెద్దలు నేటి తరానికి ఇది మన ఆచారం కనుక పాటించాలి అని గుడ్డిగా ఆచరిస్తూ, ఆచరింపచేస్తూ ఉన్నారు తప్ప వాటి వెనుక ఎంతో విజ్ఞానం దాగి ఉందని మరియు శాస్త్రీయ విశిష్టత కూడా ఉన్నదని చెప్పడం లేదు. దాని వలన మన సనాతన సాంప్రదాయాలను సైన్సుతో పోల్చి మూఢ నమ్మకాలుగా, అంధ విశ్వాసాలుగా చులకన భావంతో చిన్న చూపు చూస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణగా హనుమాన్ చాలీసా లోని “యుగ సహస్ర యోజన పర భానూ | లీల్యోతాహి మధుర ఫల జానూ ||” అంటూ సూర్యునికి మరియు భూమికి మధ్య గల దూరాన్ని ఖచ్చితంగా తెలిపే ఈ రెండు పంక్తులు చాలు, ఆ కాలంలోని మన పూర్వీకులు ఎంతటి జ్ఞానులో, మన శాస్త్ర-పురాణాలలో మరియు వేదాలలో ఎంతటి జ్ఞానం దాగి ఉందనే విషయం మనం అర్ధం చేసుకోవచ్చును.
నేడు ఎంతో గొప్పగా చెప్పుకునే సైన్స్ కూడా పుట్టింది మన సనాతన ధర్మం మరియు వేదాల నుండే అన్న సత్యం మనం గ్రహించి, మన ముందు తరాల వారికి వివరించి చెప్పడం, వాళ్ళ చేత ఆచరింపచేయడం మన కర్తవ్యం. మన సనాతన ధర్మంలో ఎన్నో హిందూ పండుగలు ఉన్నప్పటికీ, మన పెద్దలు చూపిన ముఖ్య ఉద్ధేశమే మూలము.
కనుక ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మరియు పండుగల ద్వారా మన పూర్వీకులు మనకు ఎంతో జ్ఞాన సంపదను అందించారు అని గ్రహించాలి. ఈ జ్ఞాన సంపదను మన ముందు తరాలకు అర్థవంతంగా అందించే బాధ్యత మన అందరిదీ.