కనుమ పండుగ

మనం ఇంతకు ముందు బ్లాగ్ లో సంక్రాంతి పండుగ గురించి తెలుసుకున్నాం కదా! సంక్రాంతి పండుగ మన తెలుగు వారందరికీ ఎంతో ముఖ్యమైన పండుగ. మూడు రోజుల పాటు సాగే ఈ సంక్రాంతి పండుగలో భాగంగా మూడవ రోజున కనుమ పండుగను జరుపుకుంటాము. కనుమ పండుగ అంటే మనకు గుర్తు వచ్చినంత వరకు అది పశువులకు సంబంధించిన పండుగ.

కనుమ పండుగ అంటే ఏమిటి?

అయితే ఈ కనుమ పండుగను ఎందుకు చేసుకుంటారు? ఈ పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఈ కనుమ పండుగ నాడు పశువులను ఎందుకు పూజిస్తారు? వాటికి అంత ప్రత్యేకత ఎందుకు ఇస్తారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ బ్లాగ్ ను చదవండి. 

మన తెలుగు వారు అందరూ కలిసి ఎంతో ఆనందంగా మూడు రోజుల పాటు ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చేదే కనుమ పండుగ. ఈ సంవత్సరం కనుమ పండుగ జనవరి 15వ తేదీన వచ్చింది.

కనుమ పండుగను ఎలా జరుపుకుంటాం?

అయితే ఈ కనుమ పండుగను ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకూ భోగి, సంక్రాంతి పండుగలు మన కోసం జరుపుకున్నాం కదా, కానీ ఈ కనుమ పండుగకి మాత్రం మన చుట్టూ ఉండే ప్రకృతి మరియు మనకు సహాయం చేసిన పశువులకు, పక్షులకు కృతజ్ఞతలను తెలుపడానికి జరుపుకుంటాము.

పశువులకు కృతజ్ఞతలు తెలపడం

ఎందుకంటే సంక్రాంతి పండుగకు రైతులు పండించిన పంట అంతా ఇంటికి చేరుకుంటుంది. అయితే ఇప్పటి వరకు తమ శక్తి అంతా ఉపయోగించి పొలం పనుల్లో రైతులకు సహాయం చేసిన పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అది ఎలా అనగా, రైతులకు ఇంత కాలం సాయం చేసిన పశువులకు విశ్రాంతి దొరుకుతుంది.

పశువుల సంరక్షణ

చాలా కష్టపడి అలసిపోయి, నీరసమైపోయిన పశువులకు బలాన్ని చేకూర్చేందుకు గాను వాటికి ఉప్పుచెక్క (మద్ది మాను, నేరేడు మాను చెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు కాయ,.. ఇలా కొన్ని రకాల మూలికలను సేకరించి వాటిని ఉప్పుతో కలిపి మెత్తటి పొడిలా దంచుతారు.) పేరుతో ఔషధాలతో కూడిన పొట్టుని తినిపిస్తారు.

పశువుల అలంకరణ మరియు పూజ విధానం

ఆ తరువాత పశువులనన్నింటిని ఒక చోటుకి చేర్చి వాటికి స్నానం చేయించి ఇంటికి తీసుకువస్తారు. అలా తీసుకువచ్చిన పశువులకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టి, వాటి మెడలో దండలు వేసి అందంగా అలంకరిస్తారు. మరికొంత మంది అయితే ఆ పశువుల కొమ్ములకు ఇత్తడి తొడుగులు తయారు చేయించి పెడతారు.

ఇలా తమ శక్తికి తగ్గట్టు ఎవరికి నచ్చిన విధంగా వారు తమ పశువులను అందంగా తయారు చేసుకుంటారు. అలాగే ఆ పశువులు ఉండే ప్రదేశాలని కూడా శుభ్రం చేసి ముగ్గులు పెట్టి, పూల దండలతో అలంకరిస్తారు. పశువులను అందంగా అలంకరించిన తరువాత వాటికి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టి తమ కృతజ్ఞతలను తెలుపుకుంటారు. ఇలా పశువులను పూజించడం మన సాంప్రదాయం.

పక్షుల ఆదరణ

కేవలం పశువులను పూజించడమే కాకుండా, పక్షులను కూడా ఆదరించే సాంప్రదాయం మనకు కనిపిస్తుంది. అందుకే కొత్త పంటలలోని ధాన్యపు కంకులను ఇంటి చూర్లకు వేలాడదీస్తారు. అందువలన చిన్న చిన్న పక్షులకు ఆహారం లభిస్తుంది అని ఈ విధంగా చేస్తారు.

కనుమ పండుగ ప్రత్యేకతలు

కొన్ని ప్రాంతాలలో కనుమ పండుగ నాడు తాము మొక్కిన మొక్కులను తీర్చుకోవడానికి కోళ్లను, మేకలను బలి ఇస్తారు. ఆ తరువాత బంధువులందరు కలిసి బోజనాలు చేస్తూ అందరూ కలిసి ఆనందంగా గడుపుతారు. మరి కొన్ని ప్రాంతాలలో ముక్కనుమ నాడు గ్రామ దేవతలకు పసుపు కుంకుమలను ఇచ్చి, గ్రామాన్ని, తమని రక్షించమని వేడుకుంటూ బలిస్తారు.

ముక్కనుమ పండుగ

సంక్రాంతి పండుగ పేరుతో మూడు రోజులు పండుగను చాలా ఆనందంగా జరుపుకుంటారు. అయితే ఈ సంక్రాంతి పండుగకు ముగింపుగా జరుపుకునేదే ముక్కనుమ. ఇది కనుమ పండుగ తర్వాత రోజు వస్తుంది.

ముక్కనుమ రోజు ఏంచేస్తారు?

అయితే ఈ ముక్కనుమ రోజున అందరూ ఉదయాన్నే లేచి తమ ఇంటి ముందు రధం ముగ్గులు వేస్తారు. ఆ రధం ముగ్గు నుండి ఒక తాడులాగ బయటకి వచ్చేలా ముగ్గుతో వేస్తూ, పక్కింటి వాళ్ళు వేసే రధం ముగ్గుని కలిపి అలా ఊరంతా కలిసి సూర్యుడిని ఉత్తరాయణం వైపు మరలే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆయన్ని సాగనంపెందుకు గాను ఊరు ఊరంతా కలిసి రధం ముగ్గు కొనను కలుపుతూ వేస్తారు.

ఈ విధంగా ఊరిలో వారు అందరూ కలిసి మెలిసి ఈ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. ఇలా అంత కలిసి పండుగను జరుపుకోవడం వలన మనలో ఉన్న మానవ సంబంధాలు బలపడతాయని ఇలాంటి పండుగలను మన పెద్దవాళ్లు మనకు అందించారు.  

Leave a Comment