సంక్రాంతి పండుగ

మనం ఇంతకుముందు బ్లాగ్ లో భోగి పండుగ గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఈ బ్లాగ్ లో సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ అనగానే కొత్త ధాన్యం, పిండి వంటలు, గాలి పటాలు, రంగవల్లులు, కొత్త అల్లుళ్లు, హరిదాసు, గంగిరెద్దులు, కోడి పందాలూ, ఇంకా మరెన్నో మనకు గుర్తు వస్తాయి కదా.

సంక్రాంతి పండుగ విశిష్టత

అయితే ఈ పండుగను మకర సంక్రాంతి అని ఎందుకు పిలుస్తారు? ఈ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత ఏమిటి? ఈ సంక్రాంతి పండుగలోని ఆంతర్యం ఏమిటి? ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగను జరుపుకోవడం వెనుక ఉన్న కథ ఏమిటి?

ఈ విషయాలు అన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా ఈ బ్లాగ్ ను చదవండి.

మకర సంక్రాంతి అనే పేరు ఎలా వచ్చింది?

మన తెలుగువాళ్లు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ఈ సంక్రాంతి పండుగనే పెద్ద పండుగ అని కూడా అంటారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ జనవరి 14వ తేదీన వచ్చింది. మన భారతీయ సాంప్రదాయంలో సంక్రాంతి పండుగకు ఎంతో విశిష్టత ఉంది.

అదేంటంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటప్పుడు చేసుకునే పండుగే మకర సంక్రాంతి పండుగ. అంటే సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే కాలాన్నే మకర సంక్రమనము అంటాము. ఈ మకర సంక్రమనము నుండి ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభం అవుతుంది.

ఉత్తరాయణం మరియు దక్షిణాయనం

ఆయనం అంటే పయనించడం. సూర్యుడు కొంత కాలం భూమధ్య రేఖకు పయనించే దిక్కుని బట్టి, దక్షిణం వైపుకి పయనిస్తున్నపుడు దక్షిణాయనం అని, ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి.

సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు, మరో ఆరు నెలలు ఒక వైపు అనగా ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయనం అయితే 6 నెలలు దక్షిణాయనం.

మన హిందూ పురాణాల ప్రకారం భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని నమ్మి సూర్యుడు భూమిపై దక్షిణం వైపుకి పయనిస్తున్నంతకాలం దేవతలకి రాత్రి గాను, ఉత్తరం వైపుకి పయనిస్తున్నంత కాలం దేవతలకు పగలు గాను అభివర్ణించారు.

ఉత్తరాయణం-పగలు పెరిగే కాలం

ఖగోళ శాస్త్రం ప్రకారము ప్రతి సంవత్సరము జనవరి 15 నుండి జూలై 15 వరకు ఉత్తరాయణం అని, జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని దక్షిణాయణం అని అంటారు. అయితే తెలుగు మాసములు, తిధులు అనుసరించి ఆంగ్ల తేదీలు మార్పు జరగవచ్చు.

ఈ ఉత్తరాయణ కాలం నుండి మన భూమిపై పగలు సమయం పెరుగుతుంది. భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగి పంటలు పండేందుకు అనువుగా ఉంటుంది, కొత్త వ్యవసాయ చక్రం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సంక్రాంతి తరువాత నుండి వేసవి కాలం రాబోతున్నదనే దానికి కూడా సంకేతం.

మకర సంక్రాంతి కథ వెనుక ఉన్న పురాణ గాధలు

మకర సంక్రాంతి రోజున సూర్యుడు తన కుమారుడైన శనిని కలవడానికి ఆయన ఇల్లు అయిన మకర రాశికి వస్తారు. ఈ ప్రత్యేకమైన రోజునే మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఇందుకు ఒక కథ కూడా ఉంది. అది ఏంటంటే, శ్రీ మధ్భాగవతం దేవి పురాణంలో ఇలా ప్రస్తావించబడింది, అదేమనగా సూర్య దేవుని రెండవ భార్య అయిన ఛాయా దేవి కుమారుడే శని దేవుడు.

యమధర్మరాజు మరియు శనిదేవుని మధ్య విభేదం

అయితే సూర్య దేవుని మొదటి భార్య కుమారుడైన యమధర్మరాజుకు శనికి మధ్య చిన్న విభేదం రావడం వల్ల శని యమధర్మరాజుపై వివక్ష చూపిస్తాడు. అందువలన సూర్య దేవుడు, ఛాయా దేవిని మరియు ఆమె కుమారుడైన శనిని దూరంగా ఉంచుతాడు.

సూర్యదేవుని శపించిన శనిదేవుడు  

దీని కారణంగా శని తన తండ్రిపై పగ పెంచుకుని అతని(సూర్య దేవునికి)కి కుష్టు వ్యాధి కలిగేలా శపిస్తాడు. సూర్యుడికి వచ్చిన కుష్టు వ్యాధిని చూసి యమధర్మరాజు చాలా బాధ పడతాడు. ఈ వ్యాధి నుండి తండ్రిని విముక్తి కలిగించేందుకు గాను కఠినమైన తపస్సు చేస్తాడు.

సూర్యదేవుడు కోపంతో కుంభ రాశిని కాల్చుట

ఇది ఇలా ఉండగా శనిపై కోపంతో ఉన్న సూర్య దేవుడు తన ఆధీనంలో ఉన్న కుంభ రాశిని కాల్చేస్తాడు/జ్వలిస్తాడు. దీనితో శని దేవుడు, అతని తల్లి ఛాయా దేవి చాలా బాధ పడతారు. తన సవతి సోదరుడైన శని దేవుడు దుఃఖంతో ఉండడం చూసి యమధర్మరాజు తట్టుకోలేక తనని క్షమించమని సూర్య దేవుని ప్రార్థిస్తాడు.

సూర్యభగవానుడిని నల్ల నువ్వులతో పూజించిన శనిదేవుడు

ఆ తర్వాత యమధర్మరాజు తన తండ్రిని ఒప్పించి కుంభంలోని వారి ఇంటికి చేరుకుంటారు. అక్కడ అంతా అగ్నికి ఆహుతై ఉంటుంది. అప్పటికి ఆ సమయంలో అక్కడ నల్ల నువ్వులు తప్ప మరేమీ లేవు. అందువలన శని దేవుడు సూర్యుడిని నల్ల నువ్వులతోనే పూజించాడు.

మకర రాశిని బహుమతిగా ఇచ్చుట

శని దేవుని ఆరాధనకు సంతోషించిన సూర్య భగవానుడు అతడిని అనుగ్రహించి తనకి రెండవ నివాసంగా మకర రాశిని బహుమతిగా ఇచ్చాడు.

నల్ల నువ్వుల వలన శనికి తన పూర్వ వైభవం వచ్చినందుకు అతనికి నల్ల నువ్వులు అంటే ఇష్టం. ఈ విధంగా సూర్యుడు తన కొడుకుని చూడడానికి ప్రతి సంవత్సరం మకర రాశిలో ప్రవేశిస్తుంటాడు. దీని కారణంగా మనకు మకర సంక్రాంతి ప్రారంభం అవుతుంది.

గంగా ఆగమనం

అయితే మకర సంక్రాంతికి సంబంధించిన ఇంకొక కథ ఉంది, అదే గంగా ఆగమనం. భగీరథుడు తన పూర్వీకులకు తర్పణం సమర్పించి వారికి ఉత్తమ గతులు ప్రాప్తించేలా చేయడం కోసం అని గంగా దేవిని భూమి పైకి ఆహ్వానిస్తాడు. అందుకు అంగీకరించిన గంగమ్మ తల్లి ఈ సంక్రాంతి రోజునే ఆకాశం నుండి భూమి పైకి వచ్చిందని నమ్ముతారు. కాబట్టి ఈ రోజున గంగ నదిలో స్నానం చేస్తే పుణ్య ఫలం లభిస్తుందని విశ్వసిస్తారు.

మకర సంక్రాంతి రోజున భీష్మునికి స్వర్గ ప్రాప్తి లభించుట

మకర సంక్రాంతికి మరొక పురాణ గాధ కూడా ఉంది. అదేంటంటే మహాభారత కాలంలో, కురుక్షేత్ర సమయంలో తన చివరి దశలో అంపశయ్యపై పడుకుని సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేంతవరకూ వేచి ఉండి ఆ తరువాత అతను తన ప్రాణాలను విడిచి పెట్టారు. అంటే సూర్యుడు ఉత్తరాయణ కాలంకి వచ్చే సమయం లో శరీరాన్ని త్యజించినట్లయితే వారి ఆత్మలు నేరుగా స్వర్గానికి వెళతాయి. అందువలన వారి ఆత్మ జనన-మరణాల నుండి విముక్తి పొందుతుంది. అందుకని భీష్ముడు ఉత్తరాయణ కాలం వరకూ ఎదురుచూసి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు.

అలానే పురాణాల ప్రకారం మందర పర్వతం కింద ఉన్న అసురులందరిని శ్రీమహావిష్ణువు అణచివేసి వారిని అంతం చేస్తూ యుద్ధాన్ని ముగించింది కూడా ఈరోజునే.

మకర సంక్రాంతి ప్రత్యేకతలు

సంక్రాంతి-రైతుల పండుగ

సంక్రాంతి రోజున రైతులు పండించిన పంటలు ఇంటికి చేరతాయి. కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది. ఆ కొత్త బియ్యంతో ముందుగా పొంగలి వండి దేవుడికి నైవేద్యంగా పెడతారు. తరువాత పిండి వంటలు(అరిసెలు, పొంగడాలు, పాకుండలు, జంతికలు, సున్నుండలు మొదలైనవి…) తయారు చేస్తారు. ఇంటి ముందు అందమైన రంగవల్లులతో తీర్చిదిద్ది గొబ్బెమ్మలు పెడతారు.

హరిదాసు మరియు గంగిరెద్దుల సందడి

హరిదాసు హరి కీర్తనలు పాడుతూ అందరి ఇళ్లకు తిరుగుతుంటారు. ఈ హరిదాసుని శ్రీహరిగా భావించి, అతని తలపైన ఉండే గిన్నె(అక్షయ పాత్ర)లో అందరూ బియ్యాన్ని పోస్తారు. ఆ శ్రీహరే తమ ఇంటికి వచ్చినట్టుగా భావిస్తారు.

అలానే గంగిరెద్దుని ఆడించే వారు కూడా అందరి ఇళ్ళకి తిరుగుతూ, పాటలు పడుతూ ఆ గంగిరెద్దుని అందరి ఇళ్ళకి తిప్పుతారు. ఇలా మన ఇళ్లకు వచ్చిన గంగిరెద్దులపైన పాత బట్టలు వేస్తారు, ఇంకా వాటిని ఆడించేవారికి తయారు చేసుకున్న పిండి వంటలు కానీ బియ్యాన్ని కానీ ఇస్తారు.

గాలి పటాలు మరియు కోడి పందాలూ     

ఈ సంక్రాంతి రోజున చిన్న పిల్లలు అంత కలిసి రంగురంగుల గాలి పటాలను తయారు చేసి వాటిని ఎగురవేస్తూ ఆడుకుంటారు. ఇంకొన్ని ప్రాంతాల్లో కోడి పందాలను నిర్వహిస్తారు.

మకర జ్యోతి దర్శనం

ఇదే కాకుండా, కార్తీక మాసం నుండి అయ్యప్ప దీక్షను తీసుకున్న వారు అయ్యప్ప కొండపైన మకర జ్యోతిని  దర్శించడానికి వెళ్ళేది కూడా ఈ మకర సంక్రాంతి రోజునే.    

మకర సంక్రాంతి పండుగ అనేది కేవలం రైతుల పండుగే కాకుండా, కుటుంబ బంధాలను బలపరుస్తూ, మన సాంప్రదాయాలను గౌరవించే గొప్ప అనుభూతి. ఇది ఉత్తరాయణ కాలం ప్రారంభాన్ని సూచిస్తూ, దేవతల కృపను పొందేందుకు, మరియు సమన్వయంతో జీవించేందుకు మంచి సంకేతంగా నిలుస్తుంది. అన్ని వయస్సుల వారు ఈ పండుగను ఆనందంతో జరుపుకోవడం, సాంప్రదాయాల పట్ల గౌరవం చూపించడం ముఖ్యమైనది.

Leave a Comment