పరశురామావతారం: శ్రీ మహావిష్ణువు యొక్క ఆరవ అవతారం

పరమ శక్తి కలిగిన శ్రీహరి భూలోకంలో ఎందుకు అవతరించాడు? దుర్మార్గుల అహంకారాన్ని అణగదొక్కేందుకు శ్రీహరి ఎందుకు మానవ రూపాలనే ధరించవలసి వచ్చింది? ముందు కథలో వామనావతారం కథలో శ్రీహరి బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని ఎలా అనగదొక్కాడో తెలుసుకున్నాం కదా!

ఇప్పుడు, మరొక కొత్త అవతారం కోసం తెలుసుకుందాం. అదే పరశురామావతారం. అసలు ఈ పరశురాముడు ఎవరు? అతనికి క్షత్రియులంటే ఎందుకు అంత కోపం? పరశురాముడు ప్రపంచం మొతాన్ని ఇరవై ఒక్క(21) సార్లు ఎందుకు తిరగవలసి వచ్చింది? అసలు శ్రీహరి ఈ అవతారం ఎత్తడానికి గల కారణం ఏంటి? ఈ విషయాలు అన్నీ తెలుసుకోవాలి అంటే ఇక ఆలస్యం చేయకుండా ఈ కథను చదవండి.

కార్తవీర్యార్జునుడి అహంకారం

అధర్మ పరులైన క్షత్రియ రాజులను నాశనము చేయుటకు శ్రీహరి ఈ అవతరమెత్తాడు. దుర్మార్గులైన క్షత్రియులలో కార్తవీర్యార్జును డైన రాజు ముఖ్యుడు. అతడు దత్తాత్రేయుని అనుగ్రహం వలన వెయ్యి చేతులను పొందాడు. అతని క్రౌర్యానికి అందరూ భయపడేవారు.

దేవతలు శ్రీహరిని శరణు వేడుట

దేవతలు, ప్రజలు అతని పేరు చెబితే హడలి పోయేవారు. అతని బాధలు పడలేక దేవతలు, మునులు శ్రీహరి వద్దకు వచ్చి తమను రక్షించమని వేడుకొన్నారు. “త్వరలో మీ బాధలు తీరగలవు” అని వారికి అభయమిచ్చాడు.

పరశురాముని జననం

ఆ కాలంలో జమదగ్ని అనే మహా ముని ఉండేవాడు. అతని భార్య రేణుకా దేవి. వారికి పుట్టిన చివరి సంతానానికి రాముడని పేరు పెట్టారు. రాముడు చాలా బలవంతుడూ, ధైర్యవంతుడైన యువకునిగా ఎదిగాడు.

పరశురాముడు శివునికై తపస్సు చేయుట

బ్రాహ్మణుడైనను రాముడు క్షత్రియునివలె యుద్ధ విద్యలన్ని నేర్చుకొన్నాడు. రాముడు కొంతకాలం తర్వాత శివుని గూర్చి గొప్ప తపస్సు చేసాడు. ఆ తపస్సుకు శివుడు మెచ్చి ఒక చేతిలో గొడ్డలితోను, మరొక చేతిలో త్రిశూలముతో ప్రత్యక్షమయ్యాడు.

పరశురాముడికి పరమేశ్వరుని వరాలు
పరశురామావతారం

పరమేశ్వరుడు వరము కోరుకోమనగా రాముడు గొడ్డలి (పరశు)ని ఇమ్మని కోరాడు. ఆ గొడ్డలి గొప్ప మహాత్మ్యము కలది. దానిని ఎదుర్కొనుట ఎవ్వరి తరము కాదు. రాముడు తన పరశును అడగగానే శివుడు దానిని రామునికిచ్చి ఈ భూమండలం మీద నిన్ను ఎవ్వరు జయించ లేరు అని రాముని దీవించి అంతర్ధానమయ్యాడు.

ఆనాటి నుండి రాముడు శివుని పరశు ధరించుటచే పరశురాముడయ్యాడు.

జమదగ్ని ఆశ్రమానికి వచ్చిన కార్తవీర్యార్జునుడు

 ఒకనాడు జమదగ్ని ఆశ్రమమునకు కార్తవీర్యార్జునుడు తన సైన్యముతో వచ్చాడు. అతడు వేట వలన అలసిపోయాడు. జమదగ్ని, అతని భార్య రేణుకా దేవి ఆ రాజును ఆహ్వానించి ఎన్నో సత్కారములు చేసారు.

కార్తవీర్యార్జునకు అతిథి మర్యాదలు చేసిన జమదగ్ని అతని భార్య

జమదగ్ని వద్ద కామధేనువు అనే ఒక ఆవు ఉన్నది. అది వారికి కావలసినంత ఆహార పదార్థాలు, పాలు, నెయ్యి జమదగ్ని దంపతులకు సమకూరుస్తుండేది. దాని సహాయముతో రేణుకాదేవి రాజునకు, అతని సైన్యమునకు కడుపునిండా భోజనము పెట్టారు ఆ ముని దంపతులు.

కార్తవీర్యార్జునుడు కామధేనువును తీసుకుని పోవుట

అటువంటి కామధేనువు ముని వద్ద కాక రాజైన తనవద్ద ఉండాలని ఆశతో కార్తవీర్యార్జునుడు తన సైనికులచే ఆవును, దాని దూడను తన రాజ్యమునకు తరలించుకొని పోయారు. కామధేనువు, ఆ విధంగా దూరం కావడంతో జమదగ్ని అతని భార్య ఎంతో విచారించుచుండిరి.

కార్తవీర్యార్జునుడిపై యుద్ధానికి వెళ్ళిన పరశురాముడు

అంతకుముందు కార్యార్థమై బయటకు వెళ్లిన పరశురాముడు ఇంటికి వచ్చి తల్లిదండ్రుల వలన జరిగిన సంగతి తెలుసుకొని కోపోద్రిక్తుడై, తన పరశును తీసికొని కార్తవీర్యార్జునుని నగరమునకు పోయి అతని సైన్యమును సర్వనాశనము చేశాడు.

కార్తవీర్యార్జునుని సంహరించి కామధేనువుని ఆశ్రమానికి చేర్చుట

తరువాత కార్తవీర్యార్జనుని వెయ్యి చేతులు సరికి అతనిని కూడా సంహరించి కామధేనువును తిరిగి తమ ఆశ్రమమునకు చేర్చాడు. కార్తవీర్యార్జునిని సంహరించి కామ ధేనువును మరల తెచ్చినందుకు జమదగ్ని దంపతులు ఎంతో సంతోషించి పరశురాముని దీవించారు.

జమాదగ్నిని చంపిన కార్తవీర్యార్జుని కుమారులు

ఒకనాడు కార్తవీర్యార్జునుని కుమారులు పరశురాముడు ఆశ్రమ ములో లేని సమయములో వచ్చి ఆశ్రమములోనున్న జమదగ్నిని బాణములతో కొట్టి చంపారు. ఆ విధంగా తమ తండ్రిని చంపిన పరశురామునిపై కసి తీర్చుకొన్నారు.

తండ్రి మరణం పట్ల పరశురాముని దుఃఖం

కట్టెలు తేవడానికి అరణ్యానికి వెళ్ళిన పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి తన తండ్రి మరణించడం చూసి ఎంతో ఆవేదనకు గురి అయ్యాడు. తన తండ్రి దేహాన్ని చూసి ఎంతో తీవ్రంగా విలపించాడు. ఈ సంఘటనతో పరశురాముని హృదయంలో ప్రతీకారం చెలరేగింది.

కార్తవీర్యార్జుని కుమారులపై పరశురాముని ప్రతీకారం

పరశురాముడు తన తండ్రి చావుకి కారణమైన కార్తవీర్యార్జుని కుమారులను అందరినీ వెదికి వెదికీ మరీ చంపాడు. మహిష్మతీ నగరాన్ని కాల్చి బూడిద చేసాడు. ఈ విధంగా రాజ్యంపై పరశురాముని ఉధృత దాడిని చూస్తుంటే అతనికి ధర్మాన్ని రక్షించాలనే సంకల్పం ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు.

క్షత్రియ రాజులపై పరశురాముడు ఇరవై ఒక్క సార్లు దండయాత్ర

తరువాత అధికార వ్యామోహంతో, భోగ లాలసతో క్రూరత్వం కల్గి అశాంతిని కలుగ చేస్తున్న రాజులపై పరశురాముడు ఇరవై ఒక్క సార్లు దండయాత్ర చేసి, రాజు అన్న ప్రతి వారిని వెంటాడి నరికి చంపాడు.

పరశురాముడు తన తండ్రిని మరల బ్రతికించుట

శమంత పంచకమనే స్థలమున తొమ్మిది మడుగుల నిండా రాజుల రక్తం నింపి తండ్రి దేహానికి శిరస్సును అతికించి గొప్ప యజ్ఞం చేసాడు. ఆ యజ్ఞం ఫలితంగా జమదగ్ని మరల బ్రతికాడు. కుమారుణ్ని ఆశీర్వదించి రేణుకతో సహా స్వర్గానికి వెళ్ళిపోయాడు. సప్తఋషులలో ఒకరిగా వెలు గొందాడు.

పరశురాముడి ప్రాయశ్చిత్తం

రాజులను సంహరించినందుకు ప్రాయశ్చిత్తంగా ఒక గొప్ప యజ్ఞం తలపెట్టి, దాని ప్రభావంతో పాప విముక్తుడై ప్రకాశించాడు పరశురాముడు.

పరశురాముడి కథ మనకు ధర్మం, న్యాయం మరియు అహంకారాన్ని అణచి వేయడంలో శక్తి యొక్క ఉన్నత స్థానాన్ని గుర్తు చేస్తుంది. పరశురాముడు తన జీవితమంతా ధర్మం కోసం అంకితమిచ్చి, అధర్మాన్ని నిర్మూలించేందుకు శక్తిని ఉపయోగించాడు.

ఆయన చేసిన యుద్ధాలు కేవలం ప్రతీకారానికి మాత్రమే పరిమితం కాకుండా, ప్రజలకు న్యాయం అందించి శాంతిని స్థాపించడమే లక్ష్యంగా సాగింది.

Leave a Comment