భగవంతుడు శ్రీ మహావిష్ణువు తన దశావతారాలలో మూడవ అవతారంగా వరాహ(పంది) అవతారాన్ని స్వీకరించి భూమాతను రక్షించిన గొప్ప కథ ఇది. విశ్వ రక్షణ కర్త అయిన శ్రీ మహావిష్ణువు భూమి ప్రాణికోటి మరియు సమస్త జీవరాశిని కాపాడిన మహిమను ఈ వరాహావతారం ద్వారా మనం వివరంగా తెలుసుకోవచ్చు.
ఇంతకు ముందు మనం శ్రీ మహావిష్ణువు రెండవ అవతారమైన కూర్మావతారం గురించి చూశాం. క్షీరసాగర మధనంలో దేవతల రక్షణ కోసం ఆయన ఎలా కూర్మ రూపాన్ని ధరించి మంధర పర్వతానికి ఆధారంగా నిలిచారో తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మూడవ అవతారం అయిన శ్రీ వరాహావతారం గురించి తెలుసుకుందాం.
భూమి మహాసముద్రంలో మునిగిపోవుట
బ్రహ్మదేవుడు ఈ అఖిల జగత్తును రూపకల్పన చేసి, స్వయంభువ మనువు(యుగంలోని తొలి మానవుడు) ప్రజాభివృద్ధి చేయుటకు నిర్ణయించుకున్న సమ యమున మహా ప్రళయం సంభవించి భూమండలం మొత్తం కొట్టుకుపోయి సముద్రపు అడుగు భాగాన్ని చేరింది. స్వయంభువ మనువు ప్రజాభివృద్ధి చేయుటకు, ప్రాణికోటి జీవించుటకు ఆధారభూతమైన భూమి లేకుండాపోయినందుకు బ్రహ్మదేవుడు ఎంతో విచారిస్తూ చేయునది లేక ధ్యానంలో నిమగ్నుడై శ్రీహరిని ప్రార్థించాడు.
వరాహావతారంలో శ్రీ హరి అవతారం
శ్రీ మహావిష్ణువు కరుణించి భూమికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది. ప్రస్తుతం భూమి మహాసముద్రంలో మునిగి – పోయింది. ఆ వాసనను అన్వేషిస్తూ భూమి జాడను తెలుసుకోవాలి. అట్టి శక్తి వరహానికే అధికంగా వుంది కాబట్టి ధ్యాన సముద్రములో మునిగిన బ్రహ్మ దేవుని ముక్కురంధ్రాల నుండి బొటన వేలు పరిమాణంలో ఒక తెల్లటి వరాహం పిల్ల పుట్టుకొచ్చింది.
అది తెల్లటి కాంతితో అలరారుతున్నది. మరీచుడు మొదలైన ముని పుంగవులూ చూస్తుండగానే ఆకాశానికి ఎగిరి పోయి క్షణంలో ఏనుగంత ప్రమాణం పెరిగి చూసే వారికి అద్భుతాశ్చర్యాలు కలిగించింది.
శంఖు, చక్ర గధాది విష్ణు బ్రహ్మల తేజస్సుతో ప్రాకాశిస్తున్న ఆ సుందర వరాహ రూపాన్ని చూసి, బ్రహ్మాది దేవతలు మునులు శ్రీహరే ఇలా వరాహ రూపాన అవతరించాడని తెలుసుకొని వేద మంత్రాలతో స్తుతించారు. సమస్త జీవకోటికి ఆధారభూతమైన భూమి సముద్రములో మునిగిపోవడం చూసి దానిని పైకి తేవడానికి శ్రీహరి ఈ అవతారం ఎత్తాడు అని బ్రహ్మాది దేవతలు కొనియాడారు.
హిరణ్యాక్షుడి ధూష్టకార్యాలు
దక్షప్రజాపతి కుమార్తె దితి. ఆమె కశ్యపుడ్ని పెళ్ళాడింది. ఆ దంపతులకు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడనే ఇద్దరు కుమారులు కల్గిరి. ఆ సమయమున భయంకరమైన ఉపద్రవాలు సంభవించినవి. పర్వాతాలు కంపించినవి. ఉరుములు, మెరుపులతో భయంకరమైన పిడుగులు పడ్డాయి.
ఈ ఇద్దరు కుమారులు పర్వతా కారులు, తండ్రి అయిన కశ్యపుని వద్ద పెరిగి పెద్ద వారైనారు. వీరిద్దరూ రాక్షసులకు రాజులై లోకంలో అతి దుర్మార్గులై తిరుగుచుండిది. ఇలా వర గర్వంతో విర్రవీగుచూ లోకాలను పీడించ సాగారు. దేవతలను, మునులను, బ్రాహ్మణులను ఎన్నో రకాలుగా బాధిస్తూ, యజ్ఞ యాగాదులను చెడగొడుతూ దైవ కార్యాలను ధ్వంసం చేస్తూ, లెక్కలేనన్ని పాపకార్యాలు చేసారు. ఆ దుర్మార్గుల ఆగడాలను ఆపే శక్తి ఎవరికీ లేకుండా పోయింది.
హిరణ్యాక్షుని మదగర్వం
హిరణ్యాక్షుడు మదగర్వంతో ఎల్లప్పుడూ ఏదో ఒక దుష్టకార్యం తలపెట్టి ప్రతివారినీ హింసించసాగాడు. పర్వత సమానుడైన హిరణ్యాక్షుడు పెద్ద గద చేత బూని విజయవిహారం చేస్తూ, విచ్చలవిడిగా సంచరిస్తూ “నాతో తలపడేవాడు ఈ జగత్తులోనే లేదు” అని విర్రవీగే వాడు.
దేవతల వద్దకు వచ్చి మీలో ఎవరైనా సరే! నాతో యుద్ధం చేసి గెలవండీ!” అని సవాలు చేస్తూ ఉండే వాడు. వాడి భీకర రూపం చూసి దేవతలు దాక్కునేవారు.
హిరణ్యాక్షుడు వరుణదేవుని యుద్ధానికి పిలుచుట
హిరణ్యాక్షుడికి ఏమి చేయాలో తోచక సముద్రంలో ఉన్న వరుణదేవుడి రాజధాని అయిన విభావరిపురం చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళి వరుణుని యుద్ధానికి రమ్మన్నాడు. అంతట వరుణుడు “దానవ మహారాజా! నీతో యుద్ధం చేసి పోరాడే శక్తి నాకు లేదు.
నీతో కో యుద్ధం చేయగల వీరుడు ఒకేఒక్కడు ఉన్నాడు. అతడే శ్రీ మహావిష్ణువు. ఆయన దగ్గరకు వెళ్ళు నీకు అతడు సరైన జోడి” అని చెప్పాడు.
శ్రీ హరిని వెతికే ప్రయత్నం
హిరణ్యాక్షుడు పళ్ళు పటపట కొరుకుతూ “ఏమిటీ? నాకు సరిజోడి శ్రీహరా! ఎక్కడున్నాడు వాడు” అని ఎన్నో దుర్భాషలాడి శ్రీ శ్రీమహా విష్ణువును వెతకసాగాడు. శ్రీహరి పాతాళంలో ఉన్నాడని నారదుని ద్వారా తెలుసుకొని హిరణ్యాక్షుడు పాతాళానికి బయలుదేరాడు.
వరాహ మూర్తి భూముని రక్షించుట
శ్రీమన్నారాయణుడు నీటిలో మునిగిపోయిన భూమండలాన్ని కాపాడుటకు మహా పర్వతమంత పెరిగిపోయాడు. అంతలో దిక్కులదిరేటట్లు, ఆకాశం చిల్లులు పడేవిధంగా గర్జిస్తూ సముద్ర జలాలను చీల్చుకుంటూ పాతళంలో భూమిని చేరాడు.
పాతాళంలోని భూమిని బయటికి తీస్కురావడం
ఆ పాతళంలో కొండలను పిండి చేయుచూ బ్రహ్మాండబాండములు పగులునట్లు తన కోరలతో గ్రుచ్చుచూ, సప్తసముద్రములు ఇంకి పోవునట్లు మట్టిని ఎగజిమ్ముతూ, తన కురచ తోకను గుండ్రంగా తిప్పుతూ , అచట మట్టిలో కూరుకుపోయిన భూమిని తన కోరలపై పెట్టుకొని పాతాళం నుండి పైకి రావడానికి ఉపక్రమించాడు.
శ్రీ హరిని హిరణ్యాక్షుడు అవహేళన చేయుట
అప్పుడే పాతాళంలో ప్రవేశించిన హిరణ్యాక్షుడు వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును చూసి, “అడవులలో సంచరించవలసిన వరాహం పాతాళంలో ఉన్నదేంటి? వీడేనేమో! ఆ శ్రీహరి” అనుకొని, “ఓరీ శ్రీహరీ! పందిరూపం దాల్చి పాతాళంలో దాక్కున్నావా?
ఈనాడు నీకు నా చేతిలో చావు మూడింది. రా నాతో యుద్ధం చేయి, రా గదా దండంతో నీ శిరస్సు ఖండిస్తాను.” అని పెద్ద పెద్ద రంకెలు వేస్తూ ఆవేశంతో శ్రీహరి వైపు రాసాగాడు. కాని శ్రీహరి ఇవేమి పట్టించుకోకుండా, భూమిని తన కోరలపై నిలిపి పైకి రావడాని ప్రయత్నిస్తున్న వాడిని హిరణ్యాక్షుడు అడ్డగించి, “ఓరీ పిరికిపందా! నా మాటలు ఏమీ పట్టించుకోకుండా యుద్ధానికి రమ్మంటే రాకుండా, మారు మాట్లాడకుండా తప్పించుకొని పైకి పోదామని ప్రయత్నిస్తున్నావా?
హిరణ్యాక్షుడి సవాళ్ళు
నీవు వీరుడవైతే నాతో యుద్ధం చెయ్యి ఆ భూమి మొత్తం నా సొంతం. నన్ను ఓడించి దానిని తీసుకొని వెళ్ళు” అని ఎన్నో అనరాని మాటలు అని శ్రీహరిని ఆపాడు.
శ్రీ హరి యుద్ధానికి సిద్ధమగుట
అంతట శ్రీమహావిష్ణువు భూమిని ప్రక్కనే ఉంచి హిరణ్యాక్షునిపై యుద్ధము చేయుటకు సన్నద్ధుడైనాడు.
హిరణ్యాక్షుడు శ్రీ హరిపై విరుచుకు పడుట
హిరణ్యాక్షుడు అతి భయంకర ఆకారుడై పెద్దగా రంకెలు వేస్తూ తన గదను విష్ణుమూర్తి వక్షానికి తగులునట్లు విసిరాడు. అది శ్రీహరిని తాకి అంతే వేగంతో వెనక్కు పరుగెత్తింది. గదా ధాటికి విష్ణువు కాస్త కూడా చలించలేదు.
శ్రీ హరి అసామాన్యమైన శక్తి
వాడు మళ్ళీ గదను గిర గిరా త్రిప్పి ఇంకా రెట్టింపు వేగంతో శ్రీహరి మీదకు విసిరాడు. ఈసారి శ్రీహరి తన గదతో దాన్ని వేయి ముక్కలుగా చేసాడు. ఈసారి పెద్ద శూలాన్ని విసిరాడు. దాన్ని శ్రీహరి తన చక్రాయుధంతో ముక్కలు ముక్కలుగా నరికాడు. ఈ విధంగా ఇద్దరూ భయంకర యుద్ధం చేయసాగారు.
హిరణ్యాక్షుడి అంతం
చివరకు యజ్ఞ వరాహాస్వామి ముందు హిరణ్యాక్షడు తాళలేకపోయాడు. శ్రీహరి తన చక్రంతో ఒక వేటున అతడి మెడ నరికివేశాడు. వాడు ఆహాకారాలు చేస్తూ నేలకూలాడు.
వరాహ మూర్తి హిరణ్యాక్షుని సంహరించిన తరువాత అతని రక్త ధారలతో తడిచిన మోముతో భూమిని తన కోరలపై నిలిపి నీటి పైకి వచ్చి, భూమిని నీటి ఉపరితలాన నిలిపి, మణి మయ భూషణాలతో బంగారు కవచంతో శంఖు, చక్రగదాది దివ్య ఆయుధాలతో తన నిజరూపాన్ని ధరించాడు. శ్రీమన్నారాయణుడు శ్రీ యజ్ఞ వరాహ మూర్తిగా అవతరించి సముద్ర గర్భమున పడిన ఈ భూమండలాన్ని కాపాడి సమస్త జీవరాశిని రక్షించాడు. ఈ విధంగా శ్రీ వరాహావతారం పరిసమాప్తం అయ్యింది.