శ్రీ మహావిష్ణువు అవతార గాధ

వైకుంఠ ద్వారం వద్ద జయ-విజయుల విధులు

వైకుంఠమున క్షీర సముద్రమునందు ఆదిశేషునిపై శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించుటకు మహర్షులు ముని పుంగవులు వస్తున్న సమయమది.

వైకుంఠమునకు పోవు ద్వారము వద్ద ద్వార పాలకులుగా జయ విజయులు ఉన్నారు. నిరంతరము ఆ జయ విజయులు కుడి ఎడమల నిలబడి, స్వామి సేవకు, మరియు మేలుకొలుపులకు ప్రధమ దర్శనం వారి తరువాతనే మిగతావారికిను . లక్ష్మీసమేతుడైన శ్రీమహావిష్ణువుకు ఏకాంతములో భంగం కలిగించకుండా చూడడమే వారి ప్రథమ కర్తవ్యం.

జయ విజయులకు శాపం

సనక మహర్షులు వైకుంఠం చేరడం

ఒకరోజున శ్రీ మహావిష్ణువు దర్శనార్థం బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనాతన మరియు సనత్కుమారులు అందరు కలిసి శ్రీ మహావిష్ణువును దర్శించుటకు వైకుంఠం వచ్చారు. యోగశక్తితో సమస్త లోకాలు సంచరించే ఈ మహర్షులకు ఎప్పుడూ చిన్న  వయసు బాలురుగా కనిపించే వరం కూడా ఉంది.

జయ-విజయులు అడ్డుకోవడం

వైకుంఠానికి చేరుకున్న ఆ మహర్షులు ఆరు ద్వారాలు దాటి ఏడో ద్వారం వద్దకు వచ్చేసరికి, వారిని జయ విజయులు అడ్డుకొని, “శ్రీహరిని దర్శించుటకు ఇది తగిన సమయము కాదు” అన్నారు. మహర్షులు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా వారు వినిపించు కోలేదు.

జయ-విజయులు శ్రీహరిని వేడుకొనుట

అందుకు ఆ ఋషులు కోపావేశులై “మీరు భూలోకంలో జన్మించి, శ్రీహరికి దూరమగుదురు గాక” అని శపించారు. మునుల శాపానికి భయపడిన జయ-విజయులు తాము చేసిన అపచారాన్ని మన్నించమని కోరారు. శ్రీమహావిష్ణువును చూడకుండా ఎప్పుడూ ఉండలేమని, శాపవిమోచనం చేయమని అర్థించారు. ఇరువురి సంభాషణలు విన్న శ్రీహరి బయటకు వచ్చారు. అంతట సనక సనందులు మహావిష్ణువును స్తుతించి, ఆశీర్వాదం పొందారు. తన సేవకులు చేసింది తప్పేనని, వారు శిక్ష అనుభవించాల్సిందేనని మునులను అనునయించాడు. దీంతో వారు శ్రీమహావిష్ణువుకు భక్తితో నమస్కరించి వెళ్లిపోయారు. అనంతరం జయ-విజయులు విష్ణువు పాదాలపై పడి తమకు శాపవిమోచనం కలిగించమని వేడుకున్నారు.

జయ విజయుల శాపవిమోచన ప్రత్యామ్నాయం

శ్రీ విష్ణువు ఆజ్ఞ ప్రకారం ఎంపికలు

అయితే వారి శాపానికి తిరుగులేదని, అనుభవించాల్సిందేనని శ్రీహరి అన్నారు. ఈ మాటలకు బోరున విలపించిన ఆ సేవకులు మిమ్మల్ని విడిచి ఉండలేమని, ఎలాగైనా శాపవిమోచనం కలిగించాలని ప్రాధేయపడ్డారు. వారు అంతగా అర్ధించడంతో అభయమిచ్చిన నారాయణుడు, ఓ పరిష్కార మార్గంగా రెండు ఎంపికలు ఇచ్చారు, “విష్ణుభక్తులుగా భూమిపై ఏడు జన్మలు తీసుకోవడం మొదటి ఎంపిక కాగా, రెండవది బద్ధ శత్రువులుగా మూడు జన్మలు తీసుకోవడం” అని చెప్పారు. ఈ రెండింటిలో  దేనినైనా అనుభవించిన తర్వాత, వారు వైకుంఠంలో తమ స్థాయిని తిరిగి పొందగలరు మరియు శాశ్వతంగా అతనితో ఉండగలరు.

జయ-విజయుల జన్మలు

ఏడేళ్ల పాటు విష్ణువుకు దూరంగా ఉండడాన్ని జయ-విజయులు భరించలేకపోతున్నారు. తన శత్రువులుగా, వారిని ఓడించడానికి దేవునిగా మూడు సార్లు భూమిపై అవతరించాలి. ఈ విధంగా, వారు తమ ప్రతి జన్మలో ఆయనను కలుసుకుంటారు. తత్ఫలితంగా, వారు విష్ణువుకు శత్రువులుగా ఉండవలసి వచ్చినప్పటికీ, వారు భూమిపై మూడుసార్లు జన్మించాలని ఎంచుకున్నారు. అందువలన జయ విజయులు మొదటి జన్మము నందు హిరణ్యాక్ష-హిరణ్యకశిపులు గాను, రెండవ జన్మము నందు రావణ-కుంభకర్ణులు గాను, మూడవ జన్మమునందు శిశుపాల-దంతవక్త్రులు గాను, ఈ భూమిపై జన్మించి శ్రీహరికి బద్ధ శత్రువులుగా ఉండి దేవతలను, మునులను, ఋషులను, పండితులను, ప్రజలను హింసిస్తూ ఉంటారు.

అంబరీషుడు మరియు దూర్వాసుడు

(కార్తీక పురాణం 24-29 కథల ఆధారంగా) ఇది ఇలా ఉండగా దీనికి మునుపు పూర్వ కాలంలో అంబరీషుడు అనే రాజు ఉండేవాడు, అతను గొప్ప విష్ణు భక్తుడు. అతడు ప్రతీ ద్వాదశినాడు తప్పకుండా ద్వాదశీ వ్రతము చేస్తుండేవాడు.

అంబరీషుడు ద్వాదశి వ్రతం చేయుట

ఒక ద్వాదశి నాడు అంబరీషుడు వ్రతం చేసి, ఉపవాసం ఉండి, మరునాడు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాసదీక్ష విరమించి, ద్వాదశి పారాయణ చేయడానికి ముందుగా బ్రాహ్మణ సమారాధన చెయ్య బోతుండగా దూర్వాస మహర్షి అక్కడకు వస్తాడు.

దూర్వాసుడికి అర్ఘ్య పాద్యాలు ఇచ్చి భోజనానికి కూర్చోమనగా ఆ మహర్షి నదీస్నానానికి వెళ్లి వస్తానని చెబుతాడు. స్నానార్థం నదికి వెళ్ళిన దుర్వాసుడు ఎంతకూ తిరిగి రాడు. ద్వాదశి ఘడియలు గడిచి పోతున్నాయని భావించి, ద్వాదశి ఘడియలు గడవక మునుపు దీక్ష విరమించడం కోసం భుజించక పోతే వ్రత భంగం జరుగుతుంది, భుజిస్తే అతిథిని భంగ పరచి నట్లు అవుతుంది.కనుక అంబరీషుడు అక్కడ ఉన్న పెద్దలసలహా మేరకు, సమారాధన చేసి, జల పానం సేవించి, దీక్షా విరమణ చేస్తాడు.

అంబరీషునిపై దూర్వాసుని కోపం

అప్పుడే దూర్వాసుడు నదీస్నానం ముగించుకొని వచ్చి జరిగిన విషయం గ్రహించి కోపోద్రిక్తుడై “ ఓరీ మదాంధ! నన్ను భోజనానికి రమ్మని, నేను  రాకుండానే భుజించినావా? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము? అంబరీశా! నీవెట్లు పవిత్ర రాజ కుటుంబంలో పుట్టినావురా?” అని కోపముతో నోటికివచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపానికి భయపడి అతని పాదములపై  పడెను.

దూర్వాసుడు అంబరీషుని శపించుట

దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమ కాలితో తన్ని “ దోషికి శాపం ఇవ్వకుండా ఉండకూడదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహము గాను, యైదవ జన్మలో వామనుడుగాను, ఆరవజన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడవుగాను, యేడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, యెనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగాను, పదవ జన్మలో పాపబుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక” అని వెనక ముందు ఆలోచించక శపించెను.

శ్రీ మహావిష్ణువు దూర్వాస శాపాన్ని తాను స్వీకరించుట

దూర్వాసునకు ఇంకను కోపము తగ్గక పోవడంతో మరల శపించబోతుండగా, శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృథాకాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగకుండా – అంబరీషుని హృదయములో ప్రవేశించి “మునివర్యా! అటులనే – మీ శాపమనుభవింతు” నని ప్రాధేయపడెను.

కాని దూర్వాసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా, శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను, అధి నిప్పులు కక్కుతూ దూర్వాసునిపై పడెను.

శ్రీ మహావిష్ణువును దూర్వాసుడు శరణు కోరుట

అప్పుడు దూర్వాసుడు భయంతో ముల్లోకాలు పరిగెత్తుచూ, తనను రక్షించేవారు లేకపోవడంతో వైకుంఠమందున్న శ్రీ మహా విష్ణువు వద్దకు వెళ్ళి శరణు కోరగా ఆ శ్రీహరి ఇటుల పలికెను “ ధర్మయుక్తంగా ప్రజాపాలన చేయు నా భక్తుడగు అంబరీషుని అనేక విధముల దూషించితివి మరియు నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని యింటికి నీవు అతిథివై వచ్చి కూడా, నేను వేళకు రానియెడల ద్వాదశి ఘడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పలేదు.

అతడు వ్రతభంగమునకు భయపడి, నీ రాకకై చూచి చూచి జలపానమును మాత్రమే చేసెను. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్ను అవమానించుటకు చేయలేదే? నీవు మండిపడుతున్నా సరే బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ చూసెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను.

శ్రీ మహావిష్ణువు అంబరీషుని రక్షించుట

నేనపుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడను నేనే. అతడు నీ వలని భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని, తన దేహము తాను తెలుసుకొనే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపములను లోకోపకారమునకై నేనే అనుభవింతును.”

శ్రీ మహావిష్ణువు తన శాపాలను దశావతారాలుగా మలుచుట

అది ఎటులనగా-

నీ శాపములలోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమున మనువును రక్షించు నిమిత్తము, సోమకుడు అను రాక్షసుని చంపుటకు మత్స్యరూపము ఎత్తుదును. మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మధించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు, ఆ పర్వతమును నీటిలో మునుగకుండా కూర్మరూపమున నా వీపుపై  మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని చంపి, ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపడానికి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడయిన రావణుని చంపి లోకోపచారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణుడు గాను, కలియుగమున బుద్ధుడు గాను, కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రునియింట “కల్కి” అను పేరున జన్మించి, అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులు అందరను మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పదిజన్మలను యీ విధముగా పూర్తిచేయుదును. ఇట్లు నా దశావతారముల సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము”.

దశావతారాల ప్రాముఖ్యత

ఈ భూమిపై అధర్మం, అన్యాయం ఎక్కువై రాక్షసంగా చేయరాని పనులెన్నో చేస్తుంటారు. వారినే దానవులని, రాక్షసులని అంటుంటారు. ఇలాంటి సమ యాలలో భగవంతుడు దుష్టులను శిక్షించి, సజ్జనులను రక్షించడానికి ధర్మాన్ని స్థాపించడానికి ఈ భూమి మీద అవతరిస్తాడు. వీటినే భగవంతుడి అవతారాలు అంటారు. భగవంతుడు ఇలాంటి అవ తారాలు ఎన్నో ధరించి, పాపాత్ములను నిర్మూలించి మంచివారిని రక్షించిన సంఘటనలు లెక్కకు మించి ఉన్నాయి. అయితే శ్రీ మహావిష్ణువు ధరించిన పది అవతారములు చాలా ప్రసిద్ధి పొందినవి. ఈ పది అవతారాలే ప్రపంచమున దశావతారములుగా ప్రసిద్ధి చెందినవి. అంతనా శ్రీ మహావిష్ణువు తాను స్వీకరించిన శాపములను లోక కళ్యాణార్ధం ఉపయోగించిన  ఈ దశావతార గాధలు కమనీయం – కడురమ్యం. ఒక్కొక్క అవతారం ఒక్కో జీవిత పరమార్థాన్ని సూచిస్తుంది.

Leave a Comment