మనమందరం ఇంతకుముందే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో ధర్మరక్షణకోశం సముద్రగర్భం నుండి వేదాలను ఎలా రక్షించాడో తెలుసుకున్నాం కదా! ఆ అవతారం ధర్మానికి శక్తివంతమైన బలాన్ని ఇచ్చింది. కానీ ఆ తరువాత దేవతలకు రాక్షసులకు మధ్య మరొక మహా సంఘటన జరిగింది. అదే క్షీరసాగర మధనం(పాల సముద్రాన్ని చిలుకుట).
ఈ మహాసముద్ర మధనానికి శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎందుకు ఎత్త వలసి వచ్చిందో మీకు తెలుసా? ఆ సముద్ర మధనంలో హాలాహలం అనే భయంకర విషయం ఎందుకు పుట్టుకు వచ్చింది? అమృతాన్ని పొందే కరమంలో దేవతలు రాక్షసులు ఎలా కలిసారు? శ్రీ హరికి జగన్మోహినీ అవతారం ఎందుకు అవసరం అయ్యింది?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ క్షీరసాగర మధనం కథను చదివి, ఈ కథలో దాగిన త్యాగాలు, శ్రమలు, అద్భుత విజయాలను ఆస్వాదించండి.
దూర్వాస మహర్షి శాపం
పూర్వం దూర్వాసుడు అనే ఒక మహాముని ఉండేవారు. అతను ముక్కోపి అని అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఒకసారి స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ దేవేంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని ఎక్కి, రాజ ఠీవితో వీధులలో విహరిస్తున్న సమయమున దూర్వాస మహర్షి రావడం కనిపించింది.
ఆ మహాముని తన మెడలో ఉన్న పారిజాత మాలను తీసి ప్రేమతో దేవేంద్రునికి అందించాడు. దేవేంద్రుడు ఆ పారి జాత మాలను ధరించకుండా తన వాహనమైన ఐరావతం కుంభ స్థలము నందు ఉంచాడు. ఐరావతం ఆ మాలను తొండంతో తీసి క్రింద పడవేసి కాళ్ళతో నేల రాచింది.
ఆ సంఘటన చూసిన మునీంద్రునికి ఎక్కడలేని కోపంతో నేను ప్రేమతో ఇచ్చిన పారిజాత మాలను నీవు ధరించక నేలపాలు చేసి నన్ను అవమానించావు. తక్షణమే దీనికి ఫలితం అనుభవిస్తావు. నీవు నీ భోగ భాగ్యాలను ఇంద్ర పదవిని, సిరి సంపదలను సమస్తము ఈ సముద్రములో కలిసిపోవు గాక అని శపించాడు.
దేవతలపైకి దండెత్తి వచ్చిన రాక్షసులు
మహర్షి శాపం వల్ల ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో నని దేవేంద్రుడు చింతిస్తున్నాడు. అంతలోనే రాక్షసులు పెద్ద ఎత్తున దేవతలపైకి దండెత్తి వచ్చి దేవతలందరినీ చిత్తు చిత్తుగా ఓడించారు. దేవతలు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంద్ర పదవి కాస్త రాక్షసుల వశమైంది. ఆ విధంగా దేవతలు దిక్కులేనివారై ఘోర పరాజయం పొందారు.
దేవేంద్రుడికి బ్రహ్మదేవుని సలహా
ముని శాపము వలననే జరిగిందని తెలుసుకొని దేవేంద్రుడు పర్వతం పైనున్న బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన విషయం వివరించారు. అప్పుడు బ్రహ్మదేవుడు “మీ కష్టాలు గట్టెక్కాలంటే శ్రీ మహావిష్ణువును శరణు వేడాలి” అని చెప్పాడు.
దేవతలు అందరూ కలిసి వైకుంఠం చేరుట
అందరూ కలిసి వైకుంఠానికి చేరి దేవ గణ సమేతంగా బ్రహ్మ దేవుడు అనేక విధముల శ్రీహరిని ప్రార్థించగా, పసిడి కాంతుల వెలుగు పట్టు వస్త్రాలు ధరించి, దివ్య సౌభాగ్యమైన రూపంలో దర్శన మిచ్చాడు అవతార పురుషుడు శ్రీహరి.
బ్రహ్మదేవుడు శ్రీ హరిని వేడుకొనుట
దేవ గణాదులతో సహా బ్రహ్మదేవుడు “పురుషోత్తమా! నీ దివ్య మంగళరూపము పరమ శ్రేయము. మా అందరికీ ఆది అంత్యములు నీలోనే కనిపిస్తున్నవి. ఈ సృష్టికి మొదలు తుది నీవే! ఈ దేవతలు రాక్షసుల వలన పడరాని బాధలు పడుతున్నారు వారిని కాపాడు” అని బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును వేడుకున్నాడు.
దేవతలకు శ్రీ హరి సూచనలు
అంతట శ్రీహరి కరుణా సాగరుడై “దేవతలారా మీకిది తగిన సమయం కాదు. కొంతకాలం ఓపిక పట్టండి! అమృతాన్ని పుట్టిస్తే గాని మీకీ అవస్తలు తొలగిపోవు. అమృతం పుట్టాలంటే పాల సముద్రాన్ని మధించాలి. పాల సముద్రాన్ని మధించడమంటే మాటలు కాదు.
అది మీ దేవ గణాలకు ఒక్కరికి సాధ్య పడదు. అందువలన మీరు రాక్షసులతో మంచిగా మెలగండీ! వారితో సంధి చేసుకొని, స్నేహంగా ఉండండి. రాక్షసుల చేత క్షీరసాగర మధనానికి ఒప్పించండి. నేను మీకు అన్ని విధాల సహాయ పడతాను” అని తెలియజేశాడు శ్రీమన్నారాయణుడు.
రాక్షసులతో దేవతలు సంధి చేసుకొనుట
శ్రీహరి మాటలకు దేవతలు సంతోషించి రాక్షసులతో సంధి చేసుకొని, వారితో మంచిగా ఉండడం మొదలుపెట్టారు. కొంత కాలం తరువాత “మనం కలిసి ఉంటే ఎంతటి కష్టమైన కార్యాలనైనా అవలీలగా సాధించవచ్చును. అందుకని మనం అమృతాన్ని సంపాదించాలి. అమృతం సంపాదించాలంటే పాలకడలిని మంధర పర్వతంతో మధిస్తే అమృతం లభిస్తుంది. దానిని సమానంగా పంచుకొని అందరం అనుభవిద్దాం.
అమృతం సేవిస్తే మనకు చావు ఉండదు. మూడు లోకాలలో మనకు ఎదురుండదు” అని చెప్పారు దేవతలు. ఆ మాటలు నమ్మి ‘సరే’ అన్నారు రాక్షసులు. వెంటనే దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రమును మధించడానికి పూనుకున్నారు.
క్షీరసాగర మధనం
మంధర పర్వతంతో పాల కడలిని మధించుట
దేవతలూ రాక్షసులు కలిసి వాసుకి అనే సర్ప రాజును ప్రార్ధించి, ఆయన అంగీకారం తీసుకొని అతడిని మంధర పర్వతానికి తాడుగా చుట్టి, తల భాగాన్ని రాక్షసులూ, తోక భాగాన్ని దేవతలు పట్టుకొని చిలకడం మొదలు పెట్టారు. పర్వతం అడుగు భాగాన, ఆధారం ఏమీ లేని కారణంగా మంధర గిరి పర్వతం నిలువక జారి పాల సముద్రములో జారిపోవడం జరిగింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
శ్రీ మహావిష్ణువు కూర్మావతారం
అప్పుడు ఏం చేయాలో తెలియని దేవతలు మనసున శ్రీహరిని ప్రార్థించగా, సముద్రమునందు లక్షయోజనముల వెడల్పుగా, కడు కఠోరమైన కూర్మము (గట్టి డిప్ప) వీపు భాగము, ఈ బ్రహ్మాండమునే మింగ గల్గినంత నోరు, విశ్వములన్నీ ఒక్కసారే మీదబడినా తట్టుకోగల్గిన గట్టి కాళ్ళు, పద్మముల వంటి కళ్ళు, అతి సుందర రూపంతో విష్ణుమూర్తి మహా కూర్మరూపం ధరించి దేవతలను రక్షించుటకు అవతరించాడు.
అలా తాబేలు రూపం ధరించిన శ్రీహరి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఆ సముద్రములోనికి ప్రవేశించి, చిన్న ముత్యమును అరచేతిలో పెట్టుకొని పైకి ఎత్తినట్లు సముద్రములో మునిగిన మందర పర్వతమును పైకి ఎత్తి తన వీపు మీద పెట్టుకున్నాడు.
దేవతలు రాక్షసులు ఎంతో సంతోషించారు. దేవదానవులు పాల సముద్రాన్ని మధించినంత సేపు మహా పర్వతం పడిపోకుండా ఉండి, ఆ కార్యం దిగ్విజయం గావడానికి ఎంతో తోడ్పడ్డాడు. ఈ విధంగా క్షీర సాగర మధనం అనేక సంవత్సరాలు సాగింది.
హాలాహలం అను భయంకర విషం పుట్టుక
ఆ నేపధ్యంలో ఒకానొక సమయాన పాలకడలినుండి హాలాహలం అనే భయంకర విషం పుట్టుకొచ్చింది. ఆ కాల కూట విషం ఉగ్ర రూపం దాల్చి మహావేగంతో నలువైపులా వ్యాపించసాగింది. ఆ కాలకూట ప్రళయం ఈ జగత్తు మొత్తాన్ని కాల్చివేసేలా ఉంది.
అంతట దేవతలు సర్వాంతర్యామి అయిన కైలాస పతిని(శివుని) వేడు కొన్నారు. కైలాస పతి వారి వేదనను విని అచట ప్రత్యక్షమై వారిని ఊరడించి, బ్రహ్మానందంగా అన్ని వైపులా దావానంలా వ్యాపించి ఉన్న ఆ కాలకూట విషాన్ని సూక్ష్మరూపం కావించి తన అరచేతిలోకి తీసుకొని మ్రింగి వేశాడు. ఆ విషాన్ని తన గర్భంలోకి పోనివ్వ కుండా కంఠం నందే నిలిపి వేశాడు.
పాల కడలి నుండి ఉద్భవించిన వస్తువులు
“దేవతలు రాక్షసులు కలిసి మళ్ళీ పాల సముద్రమును చిలకడం ప్రారంభించారు. అప్పుడు పాల సముద్రము నుండి ఏది కావాలంటే దాన్ని ప్రసాదించే కామధేనువు పుట్టుకొచ్చింది. యజ్ఞయాగాలకు ఆధారభూతమైన ఆ కామధేనువును మహర్షులు స్వీకరించారు.
తరువాత ఉచ్చైశ్రవం అనే దివ్యమైన అశ్వం పుట్టుకొచ్చింది. దానిని దానవుల రాజు బలిచక్రవర్తి ముచ్చట పడి తీసుకున్నాడు. ఆ తరువాత ఐరావతం అనే తెల్లని ఏనుగు, పారిజాతమనే దివ్యవృక్షము ఒకదాని వెంట ఒకటి పుట్టుకొచ్చాయి. ఈ రెండింటిని దేవతల తరుపున దేవేంద్రుడు తీసుకున్నాడు. తరువాత అత్యంత అందమైన అప్సరసలు జన్మించారు. వారిని దేవేంద్రుడు తీసుకున్నాడు. తరువాత సర్వ మంగళదాయకమైన జగన్మాత శ్రీ మహాలక్ష్మీ దేవి జన్మించింది. దివ్య స్వరూపిణి అయిన లక్ష్మీదేవి తనకు శ్రీ హరి అన్ని విధాల తగిన వరుడు అని గ్రహించి శ్రీ మహావిష్ణువును ఆమె వరించింది. అంతట శ్రీహరి ఆమెకు తన వక్షస్థలములో స్థానం ఇచ్చి లక్ష్మీదేవిని స్వీకరించాడు.
పాలసముద్రం నుండి అమృతం పుట్టుట
మళ్ళీ సముద్ర మధనం సాగింది. దేవదానవుల కృషి ఫలించి, అమృతం నిండిన పూర్ణ కుంభంతో ధన్వంతరి పాలసముద్రమునుండి బయటికి వచ్చాడు. ధన్వంతరి చేతులలోని అమృత కలశం చూడగానే దుష్టులైన రాక్షసులు బల గర్వంతో అమృత కలశంను లాక్కొని పారిపోయారు.
శ్రీ హరి మోహినీ అవతారమెత్తి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టుట
అప్పుడు శ్రీ మహావిష్ణువు కోటి దివ్య కాంతుల తేజస్సుతో అతి సౌందర్యవతిగా జగన్మోహినిగా అవతరించాడు. ఆ మోహిని అందచందాలకు రాక్షసులు ముగ్ధులై ఆమె వశులైనారు. వెంటనే జగన్మోహిని రాక్షసులను మాయచేసి, ఆమె తన అందచందాలను తళుకు బెళుకులతో దానవులను భ్రమలో పెట్టి, అమృతాన్ని దేవతలకు పంచి పెట్టింది.
రాక్షసులకు ఒక చుక్క కూడ దక్కలేదు. అమృతం సేవించిన దేవతలు ఎంతో తేజోవంతులుగా, బల పరాక్రమవంతులుగా, చావు లేని వారుగా తయారయ్యారు.
రాక్షసులపై దేవతల విజయం
ఇది గమనించిన రాక్షసులు మనము మోసపోయామని గ్రహించి దేవతలపై యుద్ధానికి దిగారు. దేవతలు అమిత బలవంతులుగా మారారు. కాబట్టి సునాయసంగా రాక్షసులను ఎదిరించి తరిమి కొట్టారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు దేవతలనే కాకుండా, లోకాలను కూడా కాపాడాడు.
శ్రీ కూర్మావతారం మహిమ
శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి పాల సముద్రాన్ని మధించడంలో దేవతలకు సాయపడి దుష్ట శిక్షణ చేసి, శిష్ట రక్షణ గావించాడు. ఈ కూర్మావతారం వలన మనకు సహనం, ధర్మం మరియు త్యాగం అనే విలువలను నేర్పుతుంది.
ఈ కథ ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని మరోకసారి చాటుతుంది. ఈ విధంగా శ్రీ కూర్మావతారం పరిసమాప్తం అయ్యింది.