మత్స్యావతారం: శ్రీమహావిష్ణువు మొదటి అవతార గాథ

శ్రీ మహావిష్ణువు దశావతారాల గాధ మనకందరికీ తెలిసినదే కదా! ఈ భూమిపై ధర్మం నశించిన ప్రతిసారీ ఆ శ్రీహరి తన దశావతారాలలో ఏదో ఒక అవతారం ఎత్తి ధర్మాన్ని నిలబెడుతున్నాడు. ఆ దశావతారాలలోని మొదటి అవతరమే మత్స్యావతారం (చేప).  అసలు ఈ మత్స్యావతారం ఏమిటి? శ్రీ మహావిష్ణువు చేపగా ఎందుకు మారారు? ఈ అవతారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ క్రిందనున్న కథను చదవండి.

హయగ్రీవుడు ఎవరు?

పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. హయగ్రీవుడు కశ్యప మహర్షి మరియు అతని భార్య దనువుల కుమారుడు. రాక్షసులలో అత్యంత శక్తివంతుడైన హయగ్రీవుడు దానవులకు రాజు అయ్యాడు.

హయగ్రీవుడు తన శక్తులను దుర్వినియోగం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవాడు. అతడు యజ్ఞయాగాదులను ధ్వంసం చేసి, ప్రజలను ధర్మ మార్గంలో నడవకుండా అడ్డుపడేవాడు.

వేదాలను దొంగిలించిన హయగ్రీవుడు

వేదాలు మానవాళికి దిశానిర్దేశాలని మరియు ధర్మాన్ని రక్షించేవి అని, శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి ఇచ్చాడు. ఈ విషయం తెలిసిన హయగ్రీవుడు, ఈ వేదాలు మానవులకు అందకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకని ఆ వేదాలను దొంగలించి, హయగ్రీవుడు సముద్రంలో దాక్కున్నాడు.

శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం

వేదాలను రక్షించి తిరిగి మానవులకు అందించాలనే భావంతో, శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ఎత్తి  (చేప రూపం ధరించి), హాయగ్రీవుని సంహరించి వేదలని తిరిగి తెచ్చెను. అది ఎటులనగా…

సత్యవ్రతుడి తపస్సు

పూర్వం సత్యవ్రతుడనే మహారాజు శ్రీ మహావిష్ణువును గూర్చి గొప్ప తపస్సు చేసి, కృతమాలిక అనే ఏటిలో సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇస్తున్నాడు. అప్పుడు ఆ దోసిలి నీటిలో ఒక చిన్న చేప పిల్ల కనిపించింది. మహారాజు దయతో ఆ చేపపిల్లను నీటిలో విడిచాడు.

దయగల రాజు

అంతట ఆ చేపపిల్ల “రాజా! ఈ నదిలో చేపలు, మొసళ్ళు ఇంకా ఎన్నో పెద్ద పెద్ద జల చరాలు ఉన్నాయి. అవి నన్ను తినేస్తాయి. వాటికి భయపడి నిన్ను ఆశ్రయించాను.” అని దీనంగా “పలికింది.

ఆ చేపపిల్ల పలుకులు విని రాజు జాలితో దానిని తన కమండలములో వేసి, తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు.

చేపపిల్ల పెరుగుతున్న అద్భుతం

ఆ చేపపిల్ల రాత్రికి రాత్రి పెరిగి పెద్దదై కమండలాన్ని మొత్తము ఆక్రమించింది. ‘రాజా! ఈ చిన్ని పాత్ర నాకు సరిపోవడం లేదు నాకు మరొక స్థలం చూపించు” అని అడిగింది ఆ చేపపిల్ల. అంతట రాజు దానిని ఒక పెద్ద పాత్రలో వేయించాడు. అది వెంటనే ఆ పాత్రను మించి పెరిగింది.

అది గమనించి సత్యవత మహారాజు ఆ చేపను ఒక కొలనులో విడిచి పెట్టాడు. వెంటనే ఆ చేప బ్రహ్మాండంగా పెరిగి కొలను కన్నా పెద్దదయ్యింది. తరువాత దానిని ఒక మహా సరస్సు నందుంచాడు. కొంతసేపటికే ఆ సరస్సుకు మించి పెరిగింది. అలా పెరుగుతూ పెరుగుతూ ఒక రోజులోనే వంద యోజనాల ప్రమాణానికి పెరిగింది.

శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమగుట

ఆ మహత్వమును చూచి మహారాజు ఎంతో ఆశ్చర్యంతో ఆ చేప మామూలు చేప కాదు అని గ్రహించి, సత్యవ్రతుడు రెండు చేతులు జోడించి “స్వామీ! మీరు సామాన్యులు కారు. సాక్షాత్తు దైవ స్వరూపులు “మీ నిజరూపం చూపించి కరుణించు” అని వేడుకున్నాడు.

అప్పుడు చేప రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఈ విధంగా చెప్పాడు. “మహారాజా! నీవు చాలా పుణ్యాత్ముడవు. కనుక నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. సరిగ్గా ఇప్పటికి ఏడు రోజుల తరువాత బ్రహ్మకు పగటి కాలం పూర్తి అవుతుంది. ఆ సమయంలో మహా జలప్రళయం సంభవించి, ఈ మూడు లోకాలు నీటియందు మునిగిపోతాయి.

అప్పుడు నేను నీ వద్దకు ఒక పెద్ద నావను పంపెదను. ఆ సమయములో నీవు భూమిమీద సమస్త సృష్టికి అవసరమైన అన్ని రకాల వృక్షకారుల విత్తనాలను, ఔషధులను, సమకూర్చుకొని, సప్త ఋషులతో పాటు ఆ నావలో ప్రవేశించుము.

ఆ నావ పెనుగాలులకు కొట్టుకొని పోకుండా వాసుకి అనే సర్పాన్ని తాడుగా జేసి, నా కొమ్ముకు కట్టుకొని నావకు ఎట్టి ప్రమాదము జరుగకుండా నేను కాపాడుతాను. బ్రహ్మదేవుని రాత్రికాలం పూర్తి అయ్యేంత వరకు నేను ఈ నావను భద్రంగా కాపాడుతాను”. అని చేపరూపంలో ఉన్న శ్రీహరి తెలిపాడు. సత్యవ్రత మహారాజు మహానంద భరితుడై శ్రీమహా విష్ణువుకు అనేక సోత్రాలు చేసి, ఎన్నో విధాల స్తుతించాడు.

ప్రళయానికి సిద్ధత

శ్రీమన్నారాయణుడు చెప్పిన విధంగా ఏడవరోజున ప్రళయం సంభవించుచుండగా ఆనాటి ప్రవాహంలో నావ సత్యవ్రత మహారాజు వద్దకు వచ్చింది. శ్రీహరి చెప్పిన విధంగా సత్య వ్రతుడు సకల ఔషధాలను, భీజాలనూ, సమకూర్చుకొని సప్త మహర్షులతో పాటు తను కూడా నావ ఎక్కాడు.

ఆ అపారమైన జల నిధిలో చేప రూపములో ఉన్న శ్రీహరి నావను అటూ ఇటూ తిప్పుతూ ఎలాంటి ప్రమాదం జరుగకుండా చూస్తున్నాడు. ఆ అద్భుత దృశ్యాన్ని సత్యవ్రతుడు, సప్తఋషులు తిలకించి శ్రీ మహావిష్ణువును వేద మంత్రాలతో స్తుతించి భక్తితో పూజించారు. ఆ సమయ మందే శ్రీమన్నారాయణుడు ఆత్మ తత్వ రహస్యంతో కూడిన పురాణ సంహితను వారికి భోధించగా అందరూ భక్తి శ్రద్ధలతో ఆలకించి చరితార్థులైనారు.

వేదాల రక్షణ

అలసిసొలసి నిద్రిస్తున్న బ్రహ్మదేవుని వద్ద నుండి ఉద్భవించిన నాలుగు వేదశ్రుతులను హయగ్రీవుడనే రాక్షసుడు అపహరించి నీటిలో దాగాడు. అది గమనించి చేప రూపంలో ఉన్న శ్రీహరి అపార జల నిధిలో నివసించసాగాడు. ఆ విధంగా ఆ ప్రళయ రాత్రి ముగిసే వరకు జలచలాకారుడగు శ్రీమన్నారాయణుడు ఆ జలము నందు సంచరించి తెల్లవారేలోపు హయగ్రీవుని వెదకి సంహరించి, వాడు దొంగిలించిన నాలుగు  వేదాలను బ్రహ్మదేవునికిచ్చాడు.

ప్రళయం అనంతరం

శ్రీహరి ప్రలయ సమయంలో తన కొమ్ముకు వాసుకి అనే మహాసర్పమును తాడుగా నావకు కట్టి విహరిస్తూ సాంఖ్యా యోగక్రియా సంహితమగు పురాణ ములను నావలో నున్న సత్యవ్రత మహారాజునకు ఉపదేశించాడు. ఆ పుణ్య ఫలమున సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యభగవానునికి శ్రద్ధాదేవునిగా (వైవస్వతుడు) జన్మించి, ఏడవ మనువుగా ప్రసిద్ధి చెందాడు.

మత్స్యావతారం మహిమ

ఈ విధంగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి హాయగ్రీవుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవునకు అప్పగించాడు. ఆ తర్వాత సృష్టికర్త బ్రహ్మ మళ్ళీ సృష్టి చేయ తల పెట్టాడు. ఇదియే మత్స్యావతార కథ. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి ఆయురారోగ్యాలు, అప్లైశ్వర్యాలు చేకూరును.

Leave a Comment