మీకు తెలుసా? భగవంతుడు తన భక్తులను, సృష్టిని రక్షించేందుకు అనేక రూపాలను ఎత్తాడని? ఒక్కో అవతారం వెనుక ఒక్కో గొప్ప కారణం ఉంటుంది. అందులోని ఒక అవతారం హిరణ్యకశిపుని సంహరించి భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తడం.
ఇంతకు ముందు మనం వరాహావతారం గురించి తెలుసుకున్నాం కదా. ఆ కథలో, భూమి మహాసముద్రంలో మునిగి పోయినప్పుడు, భూమతను రక్షించేందుకు శ్రీ హరి పంది రూపమైన వరాహ రూపంలో అవతరించాడు. ఆ మహా కథ మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ వరాహావతారం కథకు అనుసంధానంగా, హిరణ్యాక్షుడి సోదరుడైన హిరణ్యకశిపుని కథను కూడా తెలుసుకుందాం. హిరణ్యకశిపుడు బ్రహ్మ దేవునిచే అనేక వరాలను పొంది, దూరహంకారంతో ఏకంగా శ్రీ హరితోనే శతృత్వం పెంచుకున్నాడు. తన పుత్రుడైన ప్రహ్లాదుడి శ్రీ హరి భక్తికి ఓర్వలేకపోయి, ఆ బాలుని ఎన్నో విధాల హింసించాడు. ఈ మహత్తరమైన కథలో శ్రీ హరి తన భక్తుడి భక్తిని నిలబెట్టి, దుష్టుని సంహరించేందుకు నారసింహావతారంలో తాను ప్రదర్శించిన సాహసాలను గురించి తెలుసుకుందాం.
శ్రీ హరిపై హిరణ్యకశిపుని పగ
శ్రీహరి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుటకు, హిరణ్యకశిపుడు అను రాక్షస రాజును చంపుటకు నరసింహావతారము ధరించాడు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని సోదరుడు. శ్రీహరి వరహావతారములో హిరణ్యాక్షుని వధించాడు. దానికి హిరణ్యకశిపుడు ఏ విధంగా అయినా శ్రీహరిని చంపి తన పగ తీర్చుకోవాలని తహతహలాడుతున్నాడు.
హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేయుట
తనకు కూడా శ్రీహరిని జయించే బలము కావాలని, శక్తి కోసం సృష్టికర్త అయిన బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసాడు. దానికి ముల్లోకాలు అల్లకల్లోలం అవుతుండగా, దేవతలు అందరూ ఈ ఆపద నుండి మమ్ములను రక్షించమని బ్రహ్మను కోరారు.
హిరణ్యకశిపునకు బ్రహ్మదేవుని సాక్షాత్కారం
ఒంటి కాలు మీద నిలబడి తన నామమే జపిస్తున్న హిరణ్యకశిపునకు బ్రహ్మ ప్రత్యక్షమై “వత్సా! నీ తపస్సుకు మెచ్చితిని. నీకూ ఏ వరము కావలసిన నేను ఇచ్చెదను” అని అన్నాడు. దానికి హిరణ్యకశిపుడు సంతోషపడి తనకు మృత్యువు లేకుండా చేయమని, తను ఎవరి చేతిలోనూ ఓడిపోకుండా ఉండేటట్లు వరము ప్రసాదించమని బ్రహ్మను కోరాడు.
అందుకు బ్రహ్మ “నాయనా! నీకు నేను అమరత్వము ప్రసాదించలేను. పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. కాని ఏ విధముగా నిన్ను రక్షించగలనో చెప్పు. ఆ విధమైనటువంటి అన్ని శక్తులు నీకు ప్రసాదించెదను” అన్నాడు.
హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని కోరిన వరాలు
అప్పుడు హిరణ్యకశిపుడు తనకు మృత్యువు మనిషివలన కాని, జంతువు వలన కాని, రాత్రి కాని, పగలు కాని, ఇంటియందు కాని బయట కాని, భూమి మీద కాని, ఆకాశ మందు కాని రాకూడదని , తనకు ముల్లోకాల మీద అధికారము ఇవ్వమని కోరాడు. ఆ వరములను బ్రహ్మ దేవుడు ప్రసాదించాడు.
హిరణ్యకశిపుని అరాచకాలు
అనితరసాధ్యములైన వరములు పొందాను అనే గర్వంతో హిరణ్యకశిపుడు దేవతలపై యుద్ధం చేసి ఇంద్రుని సింహాసనాన్ని చేజిక్కించుకొన్నాడు. అందరూ తన నామమే జపించవలెనని శాసించాడు. ఆ విధంగా చేయనివారిని నానా హింసలు పెట్టించాడు.
శ్రీహరి దేవతలకు అభయమిచ్చుట
రాక్షసులు తమ రాజు బలము చూసుకొని దేవతలను, మునీశ్వరులను, శ్రీహరి భక్తులను అనేక విధాల హింసించసాగారు. హిరణ్యకశిపుని బాధలను సహించలేక దేవతలు తమని రక్షించ మని శ్రీమన్నారాయణుని వేడుకున్నారు.
అప్పుడు శ్రీహరి “మీరు భయపడ వద్దు, మీ బాధలు కొద్ది కాలములో తీరిపోవును. త్వరలో హిరణ్యకశివునకు ప్రహ్లాదుడనే కుమారునిగా జన్మించి, హిరణ్యకశిపుని వధిస్తాను” అని దేవతలకు శ్రీమహావిష్ణువు అభయం ఇచ్చాడు.
ప్రహ్లాదుని జననం
కొంతకాలమునకు హిరణ్యకశిపుని భార్య లీలావతి గర్భము ధరించి ఒక బాలుని కన్నది. అతని పేరే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు లీలావతి గర్భమునందు ఉండగానే నారదుడు అతనికి నారాయణ మంత్రము ఉపదేశించాడు. ప్రహ్లాదుడు బాల్యము నుండి హరి నామము జపించి, గొప్ప హరి భక్తుడు అయ్యాడు.
ప్రహ్లాదుని హరినామ భక్తి
ప్రహ్లాదుని విద్యాభ్యాసము కొరకు హిరణ్యకశిపుడు పండితులైన రాక్షస గురువులను నియమించాడు. వారు ఎన్ని చెప్పినను ప్రహ్లాదుడు తన తండ్రి నామము జపించక ఎల్లప్పుడు శ్రీహరి నామమే స్మరిస్తుండెను. తనకొడుకు తన విరోధి అయిన శ్రీహరి నామము జపించుట జీర్ణించుకోలేక పోయాడు హిరణ్యకశిపుడు.
ప్రహ్లాదుని చంపుటకు హిరణ్యకశిపుని ప్రయత్నాలు
శ్రీహరి నామ జపము మరిపించుటకు తన కుమారుడైన ప్రహ్లాదుని ఎన్నో హింసలు పెట్టాడు. అయినా ప్రహ్లాదుడు మారలేదు. చివరకు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపించుటకు అనేక విధాల ప్రయత్నించాడు. అతనికి విషము పెట్టించాడు. పాములచే కరిపించాడు. ఏనుగులచే తొక్కించాడు. పెద్ద కొండల మీద నుండి క్రిందకు త్రోయించాడు. కాని ప్రహ్లాదుడు శ్రీహరి నామస్మరణ వీడలేదు. ప్రహ్లాదునికి ఎలాంటి ఆపదలు రాలేదు.
హిరణ్యకశిపుడు శ్రీహరి ఎక్కడని ప్రహ్లాదుని ప్రశ్నించుట
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిచి “కుమారా! నువ్వు ఎన్ని చెప్పినను హరి నామస్మరణ మానడం లేదు. వాడు నాకు విరోధి. అతనిని చంపి నా కసి తీర్చుకుంటాను. కాని ఆ పిరికిపంద నాకు కనబడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎక్కడ ఉన్నాడురా నీ హరి” అని ప్రహ్లాదుని గద్దించాడు. అప్పుడు ప్రహ్లాదుడు భయపడకుండా “తండ్రీ! శ్రీహరి భగవంతుడు. అతడు సర్వాంతర్యామి. ఇక్కడ అక్కడ అని లేదు. ఆయన అంతటా ఉంటాడు” అని అన్నాడు.
శ్రీహరి కోసం హిరణ్యకశిపుడు స్తంభాన్ని బద్దలుకొట్టుట
హిరణ్యకశిపుడు ఇంకా మండిపడుతూ “ఓరి అధమా! ముల్లోకములు నన్ను చూసి భయపడతాయి. వేలెడంత లేవు నువ్వే నాకు ఎదురు సమాధానం చెబుతున్నావు. శ్రీహరి సర్వాంతర్యామి అని అంటున్నావే. అయితే నీ హరి ఈ స్తంభమునందు చూపగలవా” అని తన గద తీసికొని రాజ ప్రసాదములో నున్న ఒక పెద్ద స్తంభమును గట్టిగా కొట్టాడు.
శ్రీహరి నరసింహావతారం
ఆ స్తంభము బద్దలై దాని నుండి శ్రీహరి నరసింహావతారములో బయటకు వచ్చాడు. హిరణ్యకశిపుడు ఆ వింత ఆకారము చూచి ఇది మనిషి కాదు, మృగము కాదు. మనిషి మృగము కలిసిన విచిత్రమైన ఆకారము చూసి భయబ్రాంతులకు గురి అయ్యాడు.
హిరణ్యకశిపుని సంహారం
వెంటనే నరసింహమూర్తి హిరణ్యకశిపుని ఎత్తి పట్టుకొని సింహద్వారము గడప మీద కూర్చుని, తన ఒడిలో పడుకోబెట్టి వాడియైన తన సింహపు గోళ్ళతో అతని పొట్టను చీల్చి పేగులను తన మెడలో వేసుకొనెను. అంతట హిరణ్యకశిపుడు ప్రాణాలు వదిలాడు.
ప్రహ్లాదుని భక్తి స్తుతి
ఆ భయంకర దృశ్యము చూసి ప్రహ్లాదుడు భక్తితో శ్రీహరిని స్తుతించాడు. నారాయణుడు ప్రహ్లాదుని దీవించి రాక్షస రాజ్యమునకు రాజుగా పట్టాభిషేకము చేసాడు.
దేవతల ఆనందం
ఆ విధంగా శ్రీహరి తన నరసింహావతారములో దుష్టుడైన హిరణ్యకశివుని వధించి దేవతలను కాపాడి మరల స్వర్గలోక సింహాసనమును దేవతల రాజైన ఇంద్రునకు అప్పగించాడు. రాక్షసరాజు మరణంతో దేవతలంతా సంతోషించారు.
నరసింహావతారంతో ధర్మ పరిరక్షణ
ఈ విధంగా భక్తుని రక్షణ కోసం మరియు దుష్టుల సంహారం కోసం నరసింహ అవతారంలో శ్రీహరి ధర్మాన్ని రక్షించాడు.
నరసింహ అవతార కథ మనకు గొప్ప బోధను అందిస్తుంది-భక్తి, ధైర్యం, న్యాయం ఎప్పటికీ దుర్మార్గాన్ని ఎదుర్కుంటాయి. ప్రహ్లాదుడి అమితమైన విశ్వాసం మరియు దానిని నిలబెట్టిన శ్రీహరి సమర్ధత, ఇంకా మన జీవితాల్లో ధర్మం అనేది ఎంత ముఖ్యమూ చాటిచెబుతాయి.
ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసినది ఏమిటంటే భగవంతుని మీద నమ్మకం ఉంటే, ఏ అత్యాశ, అధర్మం మనల్ని గెలవలేదు.