భోగి పండుగ

మనం ఇంతకు ముందు బ్లాగ్ లో పండుగ అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మన తెలుగు వారు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి అయిన భోగి పండుగ గురించి తెలుసుకుందాం.

భోగి పండుగ యొక్క ప్రాముఖ్యత

మన హిందువుల పండుగలలో మకర సంక్రాంతి అత్యంత ముఖ్యమైనది. అయితే ఈ సంక్రాంతి పండుగకి ముందు వచ్చే పండుగనే ‘భోగి’ పండుగ అంటారు. భోగి పండుగ అనగానే మనకు గుర్తు వచ్చేది ఉదయాన్నే లేచి భోగి మంటలు వేయడం, చిన్న పిల్లలకు భోగి పళ్ళను పోయడం, బొమ్మల కొలువు మొదలగునవి. కానీ ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారు? భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? బొమ్మల కొలువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ బ్లాగ్ ను చదవండి.

భోగి పండుగ అంటే ఏమిటి?

భోగి పండుగ అనేది మన తెలుగువారు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి. తెలుగువాళ్లు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలలో మొదటి రోజుని భోగి అంటారు. ఈ సంవత్సరం భోగి పండుగ జనవరి 13వ తేదీన వచ్చింది.

భోగము అంటే అనుభవము అని అర్ధం. అంటే ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందాన్ని పొందుతామో దానినే భోగము అంటాము. అలాంటి భోగములు అనుభవించాల్సిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని పొందడమే నిజమైన భోగం.

కానీ ఒక్కొక్కరికి ఒక్కోటి అంటే ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. అంటే వారికి లౌకిక విషయాలలో ఆనందం దొరికితే అది భోగం. ఆ విషయం నచ్చకపోతే మరొక దానిలో ఆనందాన్ని వెతుక్కుంటారు. నిజానికి ఏది మనకు లభిస్తే మనకి ఇంకేది కావాలని అనిపించదో, ఏది మనకు పరిపూర్ణమైన, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందో అదే అసలైన భోగం. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యం అవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు.

భోగి పండుగకి సంబంధించిన కథనాలు  

అటువంటి దివ్యమైన భోగాన్ని ఈ రోజున తల్లి గోదాదేవి పొందింది. అదేమిటంటే గోదాదేవి చిన్ననాటినుండే ఆ రంగనాథుని(శ్రీరంగంలోని శ్రీమహావిష్ణువు) పూజించి, సేవించి, తరించి ఆ రంగనాథుని అనుగ్రహాన్ని పొందినది. చివరకు స్వామిని వివాహమాడి, ఆ రంగనాధునిలో లీనమయిపోయింది. రంగనాథుని సాంగత్యం అనబడేటటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని గోదాదేవి పొందింది కాబట్టే ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది అని సంప్రదాయంగా చెబుతారు పెద్దలు.

మరో కధనం మేరకు, శ్రీమహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా ఈ రోజునే. ఇంకొక వైపు ఇంద్రుని పొగరును అణచివేస్తూ శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు.

భోగి మంటల ప్రాముఖ్యత

మన శాస్త్రాల ప్రకారం, సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండడం వలన ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకుని, చలి బాధలను తప్పించుకునేందుకు, దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు, బాధలను తట్టుకున్నందుకు, ఉత్తరాయనన కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు.

భోగి మంటలతో ఆరోగ్య ప్రయోజనాలు

జనవరి నెలలో చలి ఎక్కువగా ఉండడం వలన సాధారణంగా చలి మంటలు వేసుకుంటారు. కానీ, భోగి మంటలనేవి కేవలం చలినుండి తప్పించుకోవడానికే కాకుండా ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు.

సంక్రాంతి పండుగకి సరిగా నెలరోజుల ముందు ధనుర్మాసం మొదలవుతుంది. ఈ నెలలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను(ఆవు పేడతో చేస్తారు) పిడకలుగా చేస్తారు. వాటినే ఒక దండలాగా కట్టి భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడంవల్ల గాలి శుద్ధి అవుతుంది. మన పరిసరాలలోని సూక్ష్మక్రిములు నశిస్తాయి. మనకు శ్వాసకోసకు సంభందించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషద చెట్ల కలప మరియు ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలు మంటల్లో వేయడం వలన శక్తివంతమైన గాలి విడుదల అవుతుంది.

భోగి మంటలు వేయడం వెనుక దాగి ఉన్న అర్ధం

అందుకే ఈ భోగి మంటలను ప్రతి పళ్ళెటూల్లలో విధిగా వేస్తారు. ఎందుకంటే ఊళ్ళో ఉండే వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి, ఐకమత్యం పెంచడంలో కూడా ఈ పండుగ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అగ్నిదేవుడిని ఆరాధిస్తూ, వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్టు భావిస్తారు.

భోగి స్నానం యొక్క ఉద్ధేశం

అలానే భోగి రోజున ఉదయాన్నే నువ్వుల నూనెతో మర్దనా చేసి, నలుగు(శెనగపిండి, బియ్యంపిండి, పసుపు కలిపిన మిశ్రమం) పెట్టుకుని స్నానం చేస్తారు. నువ్వుల నూనెతో మర్దన చేయడం వల్ల మన శరీరంలోని అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరిగి శరీరంలోని కండరాలకు ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి ఆందోళన తగ్గుతుంది, చలికాలంలో చర్మం పొడిబారిపోకుండా మృదువుగా, మెరుగ్గా ఉంటుంది. జుట్టు కూడా బలంగా ఉంటుంది.

అలాగే నలుగు పిండి పెట్టుకుని స్నానం చేయడం వల్ల మన చర్మంపైన ఉండే మృతకణాలు తొలగిపోతాయి. ఇంకా చర్మం కాంతివంతంగా అవుతుంది. మన పెద్ధలు పెట్టిన మరియు పాటించిన ఇలాంటి పద్ధతుల్లో ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి.

భోగి పళ్ళ ప్రాముఖ్యత:    

ఈ భోగి పండుగ రోజు భోగి పళ్ళకు(రేగు పళ్ళు) చాలా ప్రాముఖ్యత ఉంది. రోజున పెద్దవాళ్లు తమ ఇరుగు పొరుగు ఉన్న పిల్లలను, పెద్దలను ఇంటికి పిలిచి తమ చిన్న పిల్లల తలపై భోగి పళ్ళను పోస్తారు. ఈ భోగి పండ్ల కోసం రేగు పళ్లు, బంతి పూల రేఖలను, చిల్లర నాణేలను కలిపి ముందుగా చిన్నపిల్లలను తయారుచేసి హారతి ఇచ్చి దిష్టి తీస్తారు. తర్వాత ముందుగా కలిపిన భోగి పళ్ళను గుప్పెట నిండుగా తీసుకుని పిల్లల చుట్టూ మూడుసార్లు తిప్పి వారి తలమీద పోసి ఆశీర్వదిస్తారు. ఇలా చేయడం వెనుక ఒక అంతరార్ధం ఉంది.

అదేంటంటే భోగి రోజున రేగి పళ్ళను చిన్న పిల్లల తలపై పోయడం వల్ల శ్రీమన్నారాయణుని ఆశీస్సులు లభిస్తాయని పెద్దలు నమ్ముతారు. అంతేకాకుండా పురాణాల ప్రకారం ఇదే రోజున బదరీ వనంలో శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతలంతా కలిసి బదరి(రేగి) పళ్ళతో అభిషేకం చేశారు.

అప్పటి సంఘటనకు గుర్తుగా చిన్న పిల్లలను నారాయణుడిగా భావించి సంక్రాంతి ముందు రోజు భోగి పళ్ళను పోసే సాంప్రదాయం వచ్చింది అని ప్రతీతి. అంతేకాకుండా ఈ భోగ పళ్ళను పోయడం వలన తమ చిన్నారులకు నరదృష్టి, దిష్టి తొలగిపోతుందని పోస్తారు.

అలానే తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ భోగి పళ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. ఇంకా సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే ఉద్ధేశ్శంతో ఈ భోగి పళ్ళను పోస్తారు.

రేగు పళ్ళు ఆరోగ్య ప్రయోజనాలు

బొమ్మల కొలువు:

భోగి రోజు సాయంత్రం బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. బొమ్మల కొలువు అంటే అన్ని రకాల బొమ్మలను ఒకే చోట అందంగా పేర్చడం అని అర్ధం. అలాగాని ఇంట్లో ఉన్న మామూలు బొమ్మలను పెట్టడం కాదు. వాటిని పెట్టడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఈ బొమ్మల కొలువులో సాధారణ ఆట బొమ్మలు కాకుండా దేవతల బొమ్మలను పెడతారు.

ఇలా దేవతల బొమ్మలు పెట్టడం వలన పిల్లలకు మన పురాణాలలోని దేవతల కథలను తెలియచేస్తూ, మన సంస్కృతి, సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లడం ఈ సాంప్రదాయాన్ని మన పెద్ద

లు పెట్టారు. ఈ భోగి పండుగ మనకు ఆనందం, ఐక్యత, ఆరోగ్యం మరియు ఆధ్యాత్మికతను అందించే ప్రత్యేకమైన రోజు. ఈరోజు మన జీవితంలో నూతన ఆశలు, శాంతి, సుఖం, మరియు ధైర్యం పుట్టాలని కోరుకుంటూ, మన సంస్కృతి మరియు సంప్రదాయాలను గౌరవిస్తూ ఆనందంగా జరుపుకోవాలి.

Leave a Comment