శ్రీరామావతారం: శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం

భగవంతుడు, తన భక్తులను కాపాడటానికి, ఆధ్యాత్మిక ధర్మాన్ని స్థాపించేందుకు భూమిపై పలు అవతారాలు దాల్చిన విషయం మనకు తెలిసిందే. దశావతారాల శ్రేణిలో ప్రతి అవతారం ఒక విశేషమైన సందేశంతో, విలక్షణమైన లక్షణాలతో దివ్యమైన కథను మోసుకొస్తుంది.

ఆదిభగవంతుని రామావతార కథ

మన గత బ్లాగులో, పరశురామావతార కథను వివరించాము. పరశురాముడు క్షత్రియుల హింసాత్మక ఆచారాలను నరికివేయటానికి, భూలోకంలో ధర్మాన్ని స్థాపించటానికి అవతరించాడు. ఇప్పుడు, అదే పరమాత్మ తన తదుపరి అవతారమైన రామావతారంలో, మరింత విశేషమైన దైవిక కథతో భక్తుల మనసులను ఆకట్టుకుంటాడు.

జయవిజయుల శాపఫలం 

శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు జయ విజయులను భూలోకంలో పుట్టమని సనక సనందనాది మునులు శపించగా వారు మొదటి జన్మలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షులుగా, రెండవ జన్మలో రావణ, కుంభకర్ణులుగా జన్మించారు.

రామవతారం పూర్వావతరం

జయవిజయులు ఎన్నో రాక్షస కృత్యాలు చేస్తూ ఋషులను, సజ్జనులను, భగవద్భక్తులను ఎంతో పీడించుచుండిరి. వారిని సంహరించుటకే శ్రీహరి రామావతారం దాల్చాడు.

త్రేతాయుగమునసూర్య” వంశమునకు చెందిన దశరథుడనే మహారాజు కోసల దేశమును పరిపాలిస్తూ వుండేవాడు. కోసల దేశానికి రాజధాని “అయోధ్య” నగరము.

శ్రీ రాముని జననం

దశరథునకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలు కలరు. కాని, దశరథునకు చాలాకాలము వరకు సంతానము కలుగలేదు. పుత్ర కామేష్టి యజ్ఞము చేసిన తరువాత కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్షణ, శత్రుఘ్నులు జన్మించారు.

రామలక్ష్మణుల అనుబంధం

రామలక్ష్మణులిద్దరు చాలా అనోన్యంగా ఉండేవారు. లక్ష్మణుడు రాముని వదలిపెట్టి ఉండేవాడు కాదు. వీరిద్దరూ విశ్వామిత్ర మహర్షి అనుగ్రహము వలన అనేక మహిమలు గల అస్త్రములను పొంది దుర్మార్గులైన రాక్షసులను అనేక మందిని వధించారు.

శ్రీ రాముని వివాహం

మిథిలానగరాన్ని పరిపాలిస్తున్న జనకుడనే మహారాజు ప్రకటించిన స్వయం వరములో రాముడు శివధనస్సు విరిచి జనకుని కూతురు సీతను పరిణయమాడాడు. సీతాదేవి గొప్ప సౌందర్యవతి, గుణవంతురాలు, మహా పతివ్రత.

రాములవారి పట్టాభిషేకం

కొంతకాలానికి దశరథుడు రామునికి పట్టాభిషేకము చేయవలెనని తలచి, పట్టాభిషేకానికి కావలసిన సన్నాహాలు మొదలు పెట్టాడు.

కైకేయి కోరికలు-భరతుని పట్టాభిషేకం మరియు రాముడి వనవాసం

కాని దశరథుని చిన్న భార్యయైన కైకేయి, ఆమె చెలికత్తె మంథర ప్రోత్సాహముతో రామునికి రాజ్యము ఇవ్వవద్దని, తన కుమారుడైన భరతుని రాజుని చేయమని దశరథుని కోరింది. అదే కాకుండా, రాముని 14 సంవత్సరములు అడవికి పంపవలెనని కూడా ఆజ్ఞాపించింది.

రాముడి వనవాసం

తన పినతల్లి కోరికపై శ్రీరాముడు అయోధ్య నగరాన్ని వీడి వనవాసమునకు బయలుదేరుతుండగా, అతనితో అతని భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు కూడా వెళ్ళారు. వారు ముగ్గురు అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకొని పండ్లు, దుంపలు తింటూ కాలం గడుపుతున్నారు.

శూర్పణఖ  అవమానం

ఇట్లు కొంత కాలమైన తర్వాత లంకాధిపతి అయిన రావణుని చెల్లెలు శూర్పణఖ అనే రాక్షసి రాముని అందము చూసి అతనిని మోహించి, అందమైన యువతిగా మారి తనను పెళ్లాడమని రాముని కోరింది.

రాముడు ఆమెను లక్ష్మణుని వద్దకు పంపగా, లక్ష్మణుడు కోపించి శూర్పణఖ ముక్కుచెవులు కోసాడు. శూర్పణఖ తనకు జరిగిన అవమానము గురించి తన అన్నగారికి మొరపెట్టు కొంది.

రావణాసురుని బలం

అప్పటికే రావణాసురుడు శివుని గూర్చి గొప్ప తపస్సు చేసి అనేక వరములు పొంది అధిక బలవంతుడై ఉన్నాడు.

రావణునికి ఇద్దరు తమ్ములు. మొదటివాడు కుంభకర్ణుడు. వాడు అతి బలవంతుడు. ఆరు నెలలు మెలకువగా ఉండి 6 నెలలు పూర్తిగా నిద్రపోయేవాడు. రెండవ వాడు విభీషణుడు. ఇతడు చాలా సన్మార్గుడు. ఇద్దరు అన్నదమ్ములు అన్నగారైన రావణుని చెప్పుచేతులలో ఉండేవారు.

రావణాసురుని ప్రతీకారం

రావణుడు తన ముద్దుల చెల్లెలు శూర్పణఖకు జరిగిన అవమానమునకు ప్రతీకారంగా సీతను అపహరించదలచి, తన సహచరుడైన మారీచుని పిలిచి, రామలక్ష్మణులను పర్ణశాల నుండి దూరంగా తీసికొని పోవుటకై నియమించెను.

మారీచుడు బంగారు జింకగా మారుట

మారీచుడు బంగారు జింక రూపములో పర్ణశాల వద్ద తిరగసాగాడు. దానిని చూచి సీత ముచ్చటపడి రాముని ఆ జింకను పట్టి తెమ్మని కోరింది. రాముడు సీతకు తోడుగా లక్ష్మణుని పర్ణశాల వద్ద కాపలా ఉంచి, జింకను పట్టి తెచ్చుటకు బయలుదేరాడు.

జింక ఎంతకూ దొరకకపోవుటచే ఒక బాణమును సంధించి జింకవైపు వదిలాడు. ఆ బాణము తగలగానే జింక మారీచునిగా మారి “హా లక్ష్మణా! హా సీతా!” అని అరుస్తూ ప్రాణాలు విడిచింది.

లక్ష్మణ రేఖ

ఆ కేకలు విని రాముడు ఆపదలో ఉన్నాడని తలచి, లక్ష్మణుడు ఎంత చెప్పినా వినకుండా రాముని సహాయమునకు పంపింది. లక్ష్మణుడు చేసేది లేక తన వదినగారి ఆజ్ఞను పాటిస్తూ, వెళ్ళే ముందు పర్ణశాల ముందు ఒక గీత గీసి ఎట్టి పరిస్థితుల లోను ఆ గీతను దాటవద్దని సీతను ప్రార్థించి వెళ్ళాడు.

ఆ గీతనే లక్ష్మణ రేఖ అంటారు. ఆ గీత ఎంతో మహాత్మ్యము కలిగినది. దానిని ఎవరైనా బయట నుండి వచ్చినవారు దాటుటకు ప్రయత్నిస్తే వారిని మంటలు అడ్డగిస్తాయి.

రావణుడు సన్యాసి రూపం ధరించుట

ఇదే అదనుగా రావణుడు సన్యాసి రూపములో పర్ణశాల వద్దకు వచ్చి “భవతి బిక్షాం దేహీ” అంటూ సీతను భిక్ష అడిగాడు. సీత ఫలములతో, పర్ణశాలలో నుండి బయటకి వచ్చి సన్యాసిని చూసి భిక్షను తీసికొని పొమ్మని కోరింది. 

సీతాదేవిని అపహరించుట

అందుకు ఆ కపట సన్యాసి మాయమాటలు చెప్పి సీతాదేవే గీతను దాటేటట్లు చేసాడు. వెంటనే ఆ సన్యాసి రావణుడుగా మారాడు. ఆ రూపము చూచి సీత మూర్ఛపోయింది. ఆ స్థితిలో వున్న సీతను రావణుడు అపహరించి తన పుష్పక విమానంలో లంకకు తీసుకొనిపోయి అచ్చట అశోక వనములో బంధించాడు.

సీతాదేవి కోసం రామలక్ష్మణుల అన్వేషణ

రామలక్ష్మణులు పర్ణశాల వద్దకు వచ్చి సీత లేకపోవుట చూచి ఇది రాక్షసమాయగా భావించి, అడవి అంతయు సీత కోసము వెతికారు. కాని సీత జాడ కనపడలేదు.

కొన ఊపిరితో ఉన్న జటాయువును కలుసుకొనుట

వారు కొంత దూరము పోయిన తర్వాత జటాయువు అనే పక్షి రెక్కలు తెగి భూమిపై పడి కొన ఊపిరితో ఉన్నది. రామలక్ష్మణులు ఆ పక్షి వద్దకు వెళ్ళగా ఆ జటాయువు “రావణుడనే రాక్షసుడు సీతను పుష్పక విమానములో దక్షిణదిశవైపు తీసుకొని పోయాడని, అడ్డుకోబోయిన తన రెక్కలు కత్తితో ఖండించాడ“ని చెప్పి, ప్రాణాలు వదిలింది.

రామలక్ష్మణులు దక్షిణ దిశవైపు ప్రయాణం చేయుట  

రామలక్ష్మణులు ఆ జటాయువుకు దహన సంస్కారమలు చేసి సీతను వెతుకుతూ దక్షిణ దిశవైపు ప్రయాణమయ్యారు.

కిష్కింధలో రామలక్ష్మణుల ప్రవేశం

ఆంజనేయుని పరిచయం  

రామలక్ష్మణులు దక్షిణ దిక్కున ఉన్న కిష్కింధ రాజ్యానికి చేరగా అక్కడ వారికి ఆంజనేయుడు కలిశాడు. ఆంజనేయుడు వానర రాజైన సుగ్రీవునకు ప్రియమిత్రుడు. సుగ్రీవుని అన్న వాలి. అతడు మహాబలవంతుడు.

సుగ్రీవుని వ్యథ

వాలి సుగ్రీవునిపై కోపంతో అతనిని రాజ్యము నుండి వెలివేసాడు. రామలక్ష్మణులు ఆంజనేయుని ద్వారా సుగ్రీవుని దీన గాథను విని అతనికి సహాయము చేయుటకు నిశ్చయించుకొన్నారు.

వాలిని సంహరించి సుగ్రీవుని కిష్కిందకు రాజుగా చేయుట

సుగ్రీవుని కలిసి వాలి చరిత్ర తెలిసికొని తమ్ముని బాధిస్తున్న వాలిని రాముడు సంహరించి, సుగ్రీవుని కిష్కింధకు రాజును చేసాడు.

సీతాదేవి జాడకోసం వానర సైన్యం ప్రయత్నం

సుగ్రీవుని ఆజ్ఞపై వానరుల గాలింపు

సుగ్రీవుడు తన ఆధీనములోని లక్షలాది వానరులను సీతాదేవి జాడను తెలుసుకోవడానికి అన్ని దిక్కులకు పంపాడు. ఆంజనేయుడు వాయుదేవుని కుమారుడు. మహా బలవంతుడు. శ్రీరామునికి ప్రియమైన భక్తుడు.

ఆంజనేయుని లంక యాత్ర

అశోకవనంలోని సీతాదేవిని కలుసుకున్న ఆంజనేయుడు

ఆంజనేయుడు సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారము సముద్రము అవతల ఉన్న లంక చేరుకొని, అక్కడ అశోకవనములో చెట్టు క్రింద కూర్చుని విలపిస్తున్న సీతను కలిసాడు. సీతకు తను రామబంటునని చెప్పి రాముడిచ్చిన ఉంగరము అనవాలుగా సీతకు ఇచ్చాడు.

సీత ఆ ఉంగరాన్ని చూసి అతడు తన రాముడు పంపగా వచ్చిన దూత అని సంతోషించింది. సీతను కలిసికొన్నట్లు అనవాలుగా ఆమె ఇచ్చిన చూడామణి ఆభరణమును తీసికొని, తిరుగు ప్రయాణం అయ్యాడు.  

లంకాపట్టణాన్ని కాల్చిన ఆంజనేయుడు

తిరిగి వెళ్తున్న ఆంజనేయుని అడ్డుకున్న అనేకమంది రాక్షసులను చంపి, లంకాపట్టణాన్ని కాల్చి మరల రాముని సన్నిధికి చేరుకున్నాడు.

సీతాదేవి జాడను తెలియజేసిన  ఆంజనేయుడు

రాముని వధకు వచ్చిన ఆంజనేయుడు సీతాదేవిని కలిసిన విషయం చెప్పి, ఆమె ఇచ్చిన చూడామణిని రాములవారికి ఇచ్చాడు.

రామలక్ష్మణులు సుగ్రీవుని సైన్యంతో కలిసి లంకకు బయలుదేరుట

రామలక్ష్మణులు, సుగ్రీవుని వానరసైన్య సహాయముతో కలిసి లంకకు బయలుదేరారు. సముద్రముపై వారధి నిర్మించి లంకను చేరుకొన్నారు. ఆ వారధినె రామసేతు అంటారు.

విభీషణుని లంకనుండి బహిష్కరించిన రావణుడు

రావణుని తమ్ముడైన విభీషణుడు మహాసాధ్వి అయిన సీతను తిరిగి రామునికి అప్పగించి అతని క్షమాపణ చెప్పుకోమని రావణుని కోరగా, రావణుడు కోపోద్రిక్తుడై విభీషణుని లంకారాజ్యము నుండి బహిష్కరించాడు.

విభీషణుడు రాములవారిని శరణువేడుకొనుట

విభీషణుడు రాముని చేరి శరణు కోరాడు. రాముడు అతనిపై జాలిపడి రావణుని సంహరించి విభీషుని లంకారాజ్యమునకు రాజును చేసెదనని వాగ్దానము చేసాడు.

రామరావణుల యుద్ధం

లంకలో జరిగిన ఘోర యుద్ధములో రామలక్ష్మణులు రాక్షస బలగాన్ని, అందరిని సంహరించారు. తరువాత రామరావణులు గొప్ప యుద్ధము చేసి చివరకు రాముని చేతిలో రావణుడు సంహరించబడ్డాడు.

ఆ విధముగా త్రేతాయుగములో రెండవ జన్మలో రావణ, కుంభకర్ణులుగా జన్మించిన జయవిజయులను శ్రీ మహావిష్ణు రామావతారములో సంహరించాడు.

సీతారామలక్ష్మణులు తిరిగి అయోధ్య చేరుకొనుట

రావణ సంహారానంతరము, రాముడు సీతను రావణుడి చెరనుండి విడిపించి, లంకారాజ్యమునకు విభీషణుని రాజుగా చేసాడు. సీతారామలక్ష్మణులు, ఆంజనేయునితో పుష్పక విమానములో అయోధ్య చేరుకొనిరి.

రాములవారి పట్టాభిషేకం

14 సంవత్సరముల వనవాసము చేసి వచ్చిన తన అన్నగారైన రామునికి భరతుడు కోసల రాజ్యమును అప్పగించాడు. శ్రీరాముడు అయోధ్య నగరానికి రాజుగా పట్టాభిషిక్తుడై ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించాడు. రాముని పాలనలో ప్రజలందరు సుఖసంతోషాలతో, సుసంపన్నులై జీవించి తరించారు. అదే రామరాజ్యము.

Leave a Comment